పాచిపెంట: ఆడుకుంటూ బయటకు వచ్చిన మూడున్నరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం పాచిపెంట మండలంలోని కేసలి పంచాయతీ మడవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పతేడ డేవిడ్ రాజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఇంటి బయట ఉండగా ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసింది. కుక్క దాడితో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి అరుపులు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను తరిమేశారు. అనంతరం తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌న్ ఇచ్చారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాలుడికి చికిత్స అందిస్తున్నారు.


