పార్వతీపురం: జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 21 పతకాలు సాధించారు. ఈ మేరకు విజేతలైన క్రీడాకారులను కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఆగస్టు 11నుంచి 13వరకు జరిగిన ఏపీ జూనియర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారని ప్రశంసించారు. క్రీడాకారులు 11 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్య పతకం సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లా తరఫున పోటీల్లో పాల్గొనేవానని, ప్రస్తుతం మన్యం జిల్లా పేరుతోనే పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం అభినందనీయమన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పాన్సర్ చేసి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
విజేతల వివరాలు
● అండర్–16లో బి.ప్రణీత పెంటాథ్లాన్‌లో ప్రథమం, 60 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం సాధించింది. బి.సుశీల జావెలెన్‌త్రోలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
● అండర్–18లో పి.హేమంత్ జావెలిన్‌త్రోలో ప్రథమం, ఎ.దివ్య హెప్టాథ్లాన్‌లో ప్రథమ స్ధానం సాధించారు.
● అండర్–20 బాలికల విభాగంలో బి.స్పందన 800 మీటర్లలో ప్రథమం, 400 మీటర్ల హర్డిల్స్‌లో ద్వితీయం, సీహెచ్.ప్రశాంతి లాంగ్ జంప్‌లో తృతీయ స్థానంలో నిలిచింది. అండర్ –20 బాలుర విభాగంలో ఎన్. నిరంజన్ 5వేల మీటర్లు, 3వేల మీటర్లు, 4 గీ4వేల మీటర్ల రిలేలో ప్రధమ స్థానం సాధించాడు. బి.సాయి 3వేల మీటర్లలో ద్వితీయస్థానం, 1500 మీటర్లలో ద్వితీయస్థానం సాధించాడు. సీహెచ్. రాజేష్ 800 మీటర్లలో ద్వితీయస్థానం, 4 ్ఠ4వేల మీటర్ల రిలేలో ప్రథమ స్థానం సాధించారు. వి.రాహుల్, ఎం.అజయ్, బి.హరీష్, ఎం.వినయ్ తదితరులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు.
● అండర్–20 బాలుర విభాగంలో జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ డ్రెస్సులు, పరికరాలు, వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి పి.చంద్రమోహన్, అథ్లెటిక్స్ కోచ్ జోగులును కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జేసీ ఆర్.వైశాలి, డీఎస్‌డీఓ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన మన్యం క్రీడాకారులు
అథ్లెటిక్స్ పోటీల్లో 21 పతకాలు
అభినందించిన కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి


