రాజాం:
జిల్లాలో భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీని మూసేసి, ఆ భూములను ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్ట్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు ప్రభుత్వం కట్టబెడితే ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజాంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమసింగిలో ఉన్నది కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ అని, విజయరామగజపతి కోపరేటివ్ సుగర్స్ లిమిటెడ్ కింద 1969లో రైతుల అంతా సొసైటీగా ఏర్పడి ఏర్పాటుచేశారన్నారు. 1977లో పరిశ్రమలో చక్కెర తయారీ ప్రారంభమైందన్నారు. ఇది రైతుల భాగస్వామ్యంతో సాధ్యమైందని గుర్తుచేశారు. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 18 మండలాల్లోని 16 వేల మంది రైతులు ఇందులో సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారన్నారు. 1999లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో 2002లో మూతపడిందని వెల్లడించారు. 2004లో వైఎస్సార్ పాదయాత్ర సమయంలో ఫ్యాక్టరీ పరిస్థితిని రైతులు వివరించారని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ తెరిపించారన్నారు. మళ్లీ ఫ్యాక్టరినీ వినియోగంలోకి తేవాలని వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోపరేటివ్‌తో కమిటీని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఏపీఐఐసీకి ఆ భూములు బదిలీచేసేందుకు తీర్మానాలు చేయడం రైతులను మోసగించడమేనని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ చేయడం, భూములు అమ్మడం చంద్రబాబు సర్కారుకు నిరంతర ప్రక్రియగా మారిపోయిందన్నారు. 65 ఎకరాల పరిధి ఉన్న ఖరీదైన భీమసింగి ఫ్యాక్టరీ భూమిని అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ఫ్యాక్టరీకి 2 కిలోమీటర్ల దూరంలో హైవే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఉందని, పది కిలోమీటర్లు దూరంలో విజయనగరం ఉందని, 40 కిలోమీటర్లు దూరంలో పోర్టు ఉందని, పక్కనే రైల్వే లైన్ ఉందని గుర్తుచేశారు. ఇన్ని పారిశ్రామిక సౌకర్యాలు ఉన్న ఫ్యాక్టరినీ పునఃఉత్పాదనకు సిద్ధం చేయకుండా ఇలా భూములు అమ్మేస్తామని సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యమైన రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా, పబ్లిక్ హియరింగ్ పెట్టకుండా మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సబబుకాదని హితవుపలికారు. ఈ విషయాన్ని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పోరాడుతామని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ పూర్తిగా సహకార సంఘంతో ఉందని, ఆరోజు ప్రతి రైతు రూ.111లు చెల్లించి 16వేల మంది సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు ఇది రూ.40 కోట్లు షేర్ కేపిటల్‌గా ఉందని, రూ.32 కోట్ల వరకు ప్రభుత్వ ఈక్విటీ, మిగిలినది రైతుల ఈక్విటీగా ఉందని వివరించారు. అప్పట్లో ఇక్కడ రైతులే భూ సేకరణ చేశారన్నారు. విజయనగరం జిల్లాలోని 15 మండలాలతో పాటు భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభపురం, ఆనందపురం, భీమిలి మండలాల రైతులకు ఈ ఫ్యాక్టరే ఆధారమని వివరించారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
సంకిలి ఫ్యాక్టరీ మూసేస్తే ఒప్పుకోం..
సంకిలిలోని ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఫ్యాక్టరీ పరిస్థితిని ఇప్పటికే ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, పాలవలస విక్రాంత్‌లు మండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని యాజమాన్యం ఆకస్మికంగా నిలుపుదలచేస్తే పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఆ రోజు సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బొత్స సత్యనారాయణ, పాలవలస రాజశేఖరం, సాంభశివరాజు తదితరులు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరినీ
తెరవాల్సిందే...
స్థానిక మంత్రి, ముఖ్యమంత్రులదే
ఆ బాధ్యత
మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు


