సీతానగరం: మండలంలోని జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న కుంకీ ఏనుగులను తెర్లాం మండలం రామినాయుడువలస ప్రాంతంలో ఉన్న ఏనుగులను మచ్చిక చేసేందుకు వీలుగా జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసూన పర్యవేక్షణలో ఆ ప్రాంతానికి శనివారం తరలించారు. అటవీ శాఖ, స్థానిక పోలీసుల సహకారంతో మండల కేంద్రం మీదుగా భారీ భద్రత చర్యల నడుమ తరలించారు. జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపైకి రావడంతో ట్రాకర్స్ ముందస్తు హెచ్చరికలు చేశారు. ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు ఏ మేరకు మచ్చిక చేసుకొని ఈ ప్రాంతం నుంచి తీసుకుపోతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఒడిశా వైపు ఏనుగుల గుంపు
భామిని: మండలంలోని పాలవలస గిరిజన గ్రామ సమీపంలో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు శనివారం ఒడిశా గ్రామాల వైపు పయనమయ్యాయి. గడిచిన వారం రోజులుగా పాలవలస గిరిజనులకు కునుకు లేకుండా చేసిన ఈ గుంపు గ్రామ సరిహద్దుల నుంచి బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ ఏనుగుల వెంట నడిచారు.


