ఆక్రమణలపై చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై చర్యలేవీ?

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

పూసపాటిరేగ: మండల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయని, రానురాను రహదారులు (చిన్నవిగా) కుచించుకుపోతున్నాయని పట్టించుకోరా అని పతివాడ ఎంపీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనాయుడు ఆర్‌అండ్‌బీ జేఈ మీనా పట్నాయక్‌ను ప్రశ్నించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మహంతి కల్యాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రహదారుల ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన జీవో ఉన్నా క్షేత్రస్థాయిలో అది అమలుకావడం లేదని సభ్యులు అన్నారు. ఎమ్మెల్సీ పి.సురేష్‌బాబు స్పందిస్తూ ఈ విషయం కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలో 55 శాతం మాత్రమే వర్షపాతం(తక్కువ) ఉండడం వల్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, దీనిపై సభలో తీర్మానం చేయాలని కనిమెల్ల, పతివాడ ఎంపీటీసీ సభ్యులు అల్లాడ రమేష్‌, పతివాడ అప్పలనాయుడు పట్టుబట్టారు.

సరిపడ ఎరువులు సరఫరా చేయాలి..

గ్రామీణ ప్రాంతాల రైతులు సాగు చేస్తున్న పంటలకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని ఎమ్మెల్సీ సురేష్‌బాబు కోరారు. అల్లాడపాలెంలో ఎక్కువమంది బోదకాలు వ్యాధితో బాధపడే వారు ఉన్నారని, స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, వైద్యం అందేలా చూడాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలు, కాలుష్యం వల్ల చాలామంది కేన్సర్‌ బారినపడుతున్నారని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రతాప్‌, ప్రమీలాదేవి, రాజ్‌కుమార్‌లకు సూచించారు.

ప్రజాసమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు?

మండల పరిధిలో ఈ ఏడాది పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన పాఠశాలల వివరాలతో పాటు తక్కువ మార్కులు వచ్చిన పాఠశాలల వివరాలు తెలియజేయాలని ఎంఈవో రాజ్‌కుమార్‌ను ఎమ్మెల్సీ సురేష్‌బాబు అన్నారు. కొవ్వాడ గ్రామంలో తాగునీటి సమస్యకు కారణమైన మోటార్‌ మరమ్మతులు చేస్తే నేటికీ దాని బిల్లులు మంజూరు చేయకపోవడానికి కారణమేంటని పలువురు సభ్యులు నిలదీశారు. గతంలో జరిగిన ఎన్నో సమావేశాల్లో ఎన్నో సమస్యలు లేవనెత్తామని, అవి ఇప్పటికీ పరిష్కారం కాలేదని అటువంటప్పుడు సమావేశాలెందుకని గోవిందపురం ఎంపీటీసీ సభ్యురాలు దంగుడుబియ్యపు సునీత అధికారులను అడిగారు. ఇప్పటికై నా సభ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీడీవో ఎం.రాధిక, వైస్‌ ఎంపీపీ అల్లా రమేష్‌, ఉద్యాన శాఖ అధికారి ఉమాభరణి, డిప్యూటీ తహసీల్దారు సంజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బీ రోడ్ల ఆక్రమణపై

అధికారుల నిర్లక్ష్యం తగదు

రహదారులు కుచించుకుపోతున్నా పట్టించుకోరా?

పూసపాటిరేగను కరువు మండలంగా ప్రకటించాలి

మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement