పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డోలీ మోతలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో వారు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రూ.855.68 లక్షల విలువైన ట్రాక్టర్లు, వ్యవసాయ, ఉపాధి సామగ్రిని పంపిణీ చేశారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణం కోసం రూ.2,600 కోట్లు కేటాయించామని చెప్పారు. జీఓ నంబర్ 3 రద్దుతో నష్టపోయిన గిరిజన యువతకు అదే స్థాయి రక్షణ కల్పించేలా కొత్తజీవో తీసుకువస్తామని ప్రకటించారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించే దిశగా జిల్లాలో ‘ఆరోగ్య విప్లవం’, ‘మన్యం వీడియో డాక్టర్’ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి గిరిజన కుటుంబం విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. గిరిజన యువత తమ మూలాలను మరువకుండానే, ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొని రాణించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన థింసా, సోరమంజి నృత్యాలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓలు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొన్నారు.


