సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని గిరిజన సోదర, సోదరీమణులకు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం దేశ సాంస్కృతిక వైవిద్యానికి ప్రతీకలన్నారు. గిరిజనుల అభ్యున్నతికి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాది వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకులు దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాష్కెంట్‌లో రాణించిన గురునాయుడు
● ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో హ్యాట్రిక్
నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న జూనియర్ ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీ ల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ శనపతి గురునాయుడు సత్తాచాటాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగంలో స్నాచ్‌లో 119 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 146 కేజీల బరువును ఎత్తి రెండు విభాగాల్లోనూ వెండి పతకాలు సాధించాడు. మొత్తం 265 కేజీల బరువును స్కోర్‌చేసి ఆ విభాగంలోనూ మరో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకే పోటీలో మూడు వెండి పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు.
హక్కుల కోసం రోడ్డెక్కిన క్రైస్తవులు
విజయనగరం క్రైమ్: దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, హక్కులను పరిరక్షించాలని దక్షిణ భారత బాప్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సంఘమిత్ర డాక్టర్ ఆర్.ఎస్.జాన్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం వీధి మీదుగా కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చి వరకు ర్యాలీ సాగింది. మతం మారినంత మాత్రాన కులం మారదు, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతలు తొలగిపోవు అంటూ నినదించారు. మతం పేరిట దళిత ముస్లింలు, క్రైస్తవుల ప్రాథమిక హక్కులను రద్దుచేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్‌ఆర్‌బీని తరలించే దిశగా సీఎం చంద్రబాబు కుట్ర
విజయనగరం గంటస్తంభం:విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన ఆర్‌ఆర్‌బీ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు)ని అమరావతికి తరలించే దిశగా సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఇదే విషయమై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ పబ్లిక్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేజోన్ ఉన్న విశాఖలో ఆర్‌ఆర్‌బీ ఉంటేనే ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని టీడీపీ నేత పి.విజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ నిర్ణ యం వల్ల యువత నష్టపోయే ప్రమాదం ఉందని బీజేపీ నాయకుడు కుసుమంచి సుబ్బారావు పేర్కొనగా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.


