స్థానిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశంలో మాత్రం తాజా తీర్పు కొత్త సమీకరణాలకు దారితీసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం పరిమితిని దాటేలా చేయడానికి అవసరమైన న్యాయపరమైన, అనుభావిక ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. అవసరమైన అధ్యయనం, డేటా ఆధారంగా భవిష్యత్తులో రిజర్వేషన్లను పునఃపరిశీలించే అవకాశం ప్రభుత్వానికి ఉందని తీర్పు స్పష్టం చేసింది. ఈ పరిణామం పార్వతీపురం మన్యం జిల్లాలోని పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే స్థానికంగా పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు తాజా రిజర్వేషన్ లెక్కల కోసం ఎదురుచూస్తున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్న ఏపీ హైకోర్టు తాజా ఆదేశాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికల సందడి మరింత వేడెక్కనుంది. ఇంతకాలం నెమ్మదిగా సాగిన రాజకీయ కదలికలకు తాజా తీర్పుతో ఒక్కసారిగా ఊపొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేపట్టారు.
ముందే మొదలైన అధికారుల కసరత్తు
ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల లభ్యత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సాధారణంగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి సుమారు 650 మంది ఓటర్లను కేటాయించేలా కసరత్తు చేశారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, భవనాల ఫొటోలు, ఓటర్ల సంఖ్య, అక్షాంశ–రేఖాంశాలను ఎస్‌ఈసీ– ఈఎంఎస్‌లో నమోదు చేసే ప్రక్రియపైనా అధికారులు దృష్టి పెట్టారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివిధ ఫారాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి మండలాలకు పంపిస్తున్నారు. ఇందులో ఎన్నికల ప్రొసైడింగు, నామినేషన్, విత్ డ్రా పత్రాలు వంటివి ఉన్నాయి. 451 పంచాయతీల ప్రాతిపదికనే ఎన్నికలకు వెళ్తున్నారు. కొత్తగా 17 పంచాయతీలకు ప్రతిపాదనలు పెట్టినా.. వాటికి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదు. ఎన్నికల కోసం అధికారులను కూడా సిద్ధం చేస్తున్నారు. విధుల కేటాయింపులు కూడా సాగుతున్నాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు కూడా త్వరలో రానున్నాయి. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ప్రక్రి యకు కూడా సిద్ధం అవుతోంది.
ఆరు వారాల్లో ప్రక్రియ
స్థానిక సంస్థల ఎన్నికలపై అక్టోబర్ 1న హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు పరిస్థితి మరింత స్పష్టమైంది. ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరితగతిన ప్రారంభించాలని, ఆరు వారాల్లో ప్రక్రియను ప్రారంభించాలని ధర్మాసనం ఆదేశించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్న కారణంతో ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయాల్సిన అవసరం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఎస్‌ఈసీ తదుపరి అడుగులపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్, రిజర్వేషన్లు, వార్డుల వారీ ఏర్పాట్లు తదితర అంశాలు కొలిక్కి వచ్చిన వెంటనే జిల్లాల్లో ఎన్నికల యంత్రాంగం మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
కొత్త జెడ్పీతో మరో కీలక మార్పు
స్థానిక ఎన్నికలకు ముందు పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వం సెప్టెంబరులో గ్రీన్‌న్‌సిగ్నల్ ఇచ్చింది. గత నెల 25 నుంచి కొత్త జిల్లా ప్రాతిపదికన జెడ్పీ ఏర్పాటు అయ్యింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని 15 మండలాలతో కొత్త జెడ్పీ ఏర్పాటయ్యింది. దీంతో గతంలో ఉమ్మడి విజయనగరం జెడ్పీ పరిధిలో కొనసాగిన వ్యవస్థకు తెర పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త జిల్లా ప్రాతిపదికన జరగనున్నాయి. జెడ్పీ చైర్మన్ పదవి ఇక్కడే ఉండనుంది. పార్వతీపురం మన్యం రాజకీయాల్లో ఇది కీలక మార్పుగా మారింది.
15 మండలాలు.. వందలాది స్థానాలు
జిల్లాలో పార్వతీపురం, పాలకొండ రెండు రెవె న్యూ డివిజన్లు ఉండగా.. పార్వతీపురం, సాలూ రు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు జిల్లాలో ఉన్నాయి. మొత్తం 15 రెవెన్యూ మండలాలు, రెండు పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీ ఉంది. ఇక గ్రామ పంచాయతీల పరంగా చూస్తే జిల్లాలో 451 పంచాయతీలు ఉన్నాయి. రిజర్వేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీల్లోనూ కదలిక
హైకోర్టు తాజా తీర్పుతో ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో రాజకీయ పార్టీల్లోనూ కదలిక మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై స్థానికంగా ఎవరెవరు పోటీ చేయాలన్న దానిపై చర్చలు ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత అసలు రాజకీయ సమీకరణాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎదురుచూసిన పార్వతీపురం మన్యం ఇప్పుడు సన్నద్ధత దశ నుంచి ఎన్నికల కార్యాచరణ దశలోకి అడుగుపెట్టే పరిస్థితి వచ్చింది. ఎస్‌ఈసీ షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తుంది? రిజర్వేషన్లు ఎలా ఖరారవుతాయి? కొత్త జెడ్పీ పరిధిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి? అన్నదే ఇప్పుడు మన్యం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని జిల్లా పంచాయతీ అధికారి సువర్ణ తెలిపారు.
స్థానిక పోరుకు మన్యం రెడీ!
ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలు
ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలపై అధికారుల కసరత్తు
కొత్త జిల్లా ప్రాతిపదికన జెడ్పీ ఏర్పాటు కూడా కీలకం
రిజర్వేషన్లపై మారిన సమీకరణాలతో ఆశావహుల్లో ఉత్కంఠ


