సాంకేతిక విద్యకు జైఎన్‌టీయూ..! | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యకు జైఎన్‌టీయూ..!

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

విజయనగరంలోని జేఎన్‌టీయూ జీవీ సాంకేతిక విద్యకు సోపానంగా మారింది. వెనుకబడిన ప్రాంత విద్యార్థుల్లో ఇంజినీరింగ్‌ వెలుగులు పంచుతోంది. ప్రశాంతమైన వాతావరణంలోని క్యాంపస్‌ విద్యార్థుల భవితకు మార్గం చూపుతోంది. నైపుణ్యాలు, సృజనకు పదును పెడుతూ ఉద్యోగ పరిమళాలను వెదజల్లుతోంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు సాగుతున్న వేళ జేఎన్‌టీయూ జీవీ విద్యార్థుల చదువు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, సాధిస్తున్న సాంకేతిక విద్య, ఉద్యోగ అవకాశాలకు ‘సాక్షి’ అక్షర రూపం.

● ● ●

జేఎన్‌టీయూలో తరగతుల నిర్వహణ ఇలా..

విజయనగరం రూరల్‌:

అజ్ఞానం.. అవిద్య.. వెనుకబాటుతనం.. పేదరికపు సంకెళ్ల మధ్య నలిగిపోతున్న విజయనగరం జిల్లాలో సాంకేతిక వెలుగులు ప్రసరింపజేయాలన్న సమున్నత సంకల్పంతో మహానేత వైఎస్సార్‌ 2007లో నాటిన ఓ విజ్ఞానపు మొక్క.. నేడు మహా వృక్షమై విజ్ఞాన ఫలాలను ఊరూరా పంచుతోంది. అధిక డబ్బు వెచ్చించి, దూరప్రాంతాలకు వెళ్లి ఉన్నత, సాంకేతిక విద్య చదవలేని పేదపిల్లల పాలిట జేఎన్‌టీయూ జీవీ వరంగా మారింది. పైసా ఖర్చు లేకుండా... చేతిలో రూపాయి లేదన్న భయం, బెంగ లేకుండా నిశ్చింతగా ఇంజినీరింగ్‌ విద్య చదువుకుని ఉన్నత స్థానాలకు చేరేందుకు సోపానంగా నిలుస్తోంది. ఒకనాడు ఖాళీ కడుపుతో కాలేజీలో చేరిన విద్యార్థులు నేడు సాంకేతిక విద్యలో నిష్ణాతులై దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలకు చేరి కన్నవాళ్లకు, ఉన్న ఊరికి పేరు తెచ్చి ఔరా అనిపించుకుంటున్నారు. వెనుకబడిన విజయనగరం జిల్లాకు జేఎన్‌టీయూ జీవీ మకుటాయమానంగా నిలిచింది.

● కళాశాల ఏర్పాటు ఇలా..

విజయనగరం ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాటి మంత్రి బొత్స సత్యనారాయణ కృషితో 2007 సెప్టెంబర్‌ 11న జిల్లాకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఏడాది జేఎన్‌టీయూ– హైదరాబాద్‌ పరిధిలో ఉన్న క్యాంపస్‌ను 2008లో జేఎన్‌టీయూ కాకినాడ ఏర్పాటు కావడంతో దాని పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి 2022 జనవరి 11 వరకు జేఎన్‌టీయూ క్యాంపస్‌గా కొనసాగిన కళాశాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2022 జనవరి 12న జేఎన్‌టీయూ జీవీగా స్థాయి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

● ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు

జేఎన్‌టీయూ జీవీలో చదువుతున్న 200 నుంచి 250 మంది విద్యార్థులు ఏటా జరిగే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరికొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఈ ఏడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఇప్పటివరకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, జేఎస్‌డబ్ల్యూ కంపెనీలతో పాటు మరో 20 కంపెనీల్లో 218 మంది ఉద్యోగాలు సాధించారు. అలాగే, కళాశాల ఏర్పాటైన నాటి నుంచి సుమారు 3000 మంది విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాబ్‌జెమిని, కాగ్నిజెంట్‌, డెల్‌, ఒరాకిల్‌, సోఫోస్‌, తదితర సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటారు. సివిల్‌ విభాగం, మెకానికల్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అనేక కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. సెంట్రలైజ్డ్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌ (కాప్‌) యాప్‌ ఆవిష్కరించి విద్యార్థులకు సేవలు సులభంగా అందేలా డిజిటలైజ్డ్‌ లైబ్రరీని సొంతంగా రూపొందించారు.

ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డాను

మాది రైతు కుటుంబం. స్థానికంగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఉండడంతో 2016లో ఐటీ విభాగంలో విద్యార్థిగా చేరాను. కళాశాలలో నేర్చుకున్న విద్యతోనే గేట్‌ ఎంట్రన్స్‌లో 2,535 ర్యాంకు సాధించి ఎన్‌ఐటీ కాలికట్‌లో చేరి ప్రస్తుతం టెక్సాస్‌ ఇన్‌స్ట్రిమెంట్‌ సంస్థలో మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాను.

– సునీత గుల్లిపల్లి, జేఎన్‌టీయూ పూర్వవిద్యార్థి, కొరటాం గ్రామం, తెర్లాం మండలం

240 మందితో ప్రారంభమై..

ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైన తొలినాళ్లలో మెకానికల్‌, ఈసీఈ, సీఎస్సీ, ఈఈఈ బ్రాంచిలతో 240 మంది విద్యార్థుల చేరికతో కొనసాగింది. ఆ తర్వాత కాలంలో మెటలర్జీకల్‌, సివిల్‌ విభాగాలు ఏర్పాటయ్యాయి. విశ్వవిద్యాలయంగా ఏర్పాటైన తర్వాత ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సులు, ఎంటెక్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కొత్తగా సీఎస్సీ విభాగంలో ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సును ప్రవేశపెట్టారు. వీటీతో పాటు ఫార్మశీ కళాశాల కొనసాగుతోంది. ప్రస్తుతం జేఎన్‌టీయూ జీవీ పరిధిలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉన్న 26 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 6 ఫార్మశీ కళాశాలలు, 2 ఎంబీఏ కళాశాలలు అనుబంధ కళాశాలలుగా కొనసాగుతున్నాయి. ఒక్క జేఎన్‌టీయూ జీవీలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement