సీతంపేట: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మన్యంబంద్ విజయవంతమైంది. సీతంపేటలో ఉదయం నుంచే షాపులు తెరచుకోలేదు. 11 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గిరిజన సంఘం కార్యాలయం నుంచి సీతంపేట వారపు సంతవరకు ర్యాలీ చేశారు. అనంతరం కొద్ది సేపు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని, జీఓ నంబర్ 3ను చట్టం చేయాలని, గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. నాన్‌షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని నినదించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, గిరిజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు కె.భాస్కరరావు, శ్రీరాములు, బి.అప్పారావు, గంగాధర్, పి.సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.


