వీరఘట్టం: జిల్లాలోని ఆర్‌అండ్‌బీలో అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆరేడు మండలాలకు ఒక అసిస్టెంట్ ఇంజినీరు పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కొరతతో చాలా మండలాల్లో ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాలపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా విలువైన ఆస్తులు అక్రమణలకు గురవుతున్నాయి.
ఇదీ పరిస్థితి...
జిల్లాలోని 15 మండలాల్లో 4 సబ్ డివిజన్లలో ఉన్న ఆర్‌అండ్‌బీలో 15 సెక్షన్లు ఉన్నాయి. ఈ పదిహేను సెక్షన్లను పర్యవేక్షించేందుకు ప్రతీ సెక్షన్‌కు ఒక అసిస్టెంటు ఇంజినీరు(ఏఈ) ఉండాలి. గతంలో పని చేసిన వారు చాలా మంది ఇంజినీర్లు పదవీ విరమణ కావడంతో ఆయా సెక్షన్లలో కొత్తవారిని నియమించలేదు. ప్రస్తుతం పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం సబ్ డివిజన్లలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు వారికి సమీపంలో ఉన్న మండలాల్లో ఒక్కొక్కరు ఆరు మండలాలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు పనులపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో కాంట్రాక్టర్లు చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి. కొత్తగా వేస్తున్న రోడ్లు అనతికాలంలోనే చిధ్రమౌతున్నాయి.
గ్యాంగ్‌మెన్ వ్యవస్థఽ రద్దు
ఆర్‌అండ్‌బీ రోడ్డులను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రతీ 14 కి.మీలకు ఒక గ్యాంగ్‌మెన్ గతంలో ఉండేవారు. అతని పరిధిలో రోడ్డు ఎక్కడైనా మరమ్మతులకు గురైనా, రోడ్డు పక్కన ఉన్న చెట్లు పడిపోయినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేవారు. అయితే 2014 తర్వాత ఈ గ్యాంగ్‌మెన్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అంత వరకు ఉన్న గ్యాంగ్‌మెన్‌లు కాలక్రమేణా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జిల్లాలో పాలకొండలో ఒకరు, పార్వతీపురంలో ఒక గ్యాంగ్‌మన్ మాత్రమే ఉన్నారు.
అన్యాక్రాంతమౌతున్న ఆర్‌అండ్‌బీ స్థలాలు
ఒకప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య రాజకీయ నాయకులు, కలెక్టర్ స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చేటప్పుడు వీరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహాల్లో బస చేసేవారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా అంటే ఎంతో గౌరవంగా భావించేవారు. తర్వాత కాలంలో ఈ అతిధి గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో నేడు ఈ భవనాలు బూత్ బంగ్లాలుగా మారాయి. ఈ బంగ్లాలకు సమీపంలో ఉన్న విలువైన ఆర్‌అండ్‌బీ స్థలాలలను సమీపంలో ఉన్నవారు ఆక్రమించేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో రోడ్డు పక్కన ఉన్న విలువైన స్థలాలు కూడా అన్యాక్రాంతమౌతున్నాయి. ముఖ్యంగా వీరఘట్టం, పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ ఆక్రమణలు తొలగించేందుకు సంబంధిత అధికారులు లేకపోవడంతో స్థలాల ఆక్రమణలను అడ్డుకునేవారు కరువయ్యారు.
జిల్లా వ్యాప్తంగా అసిస్టెంటు ఇంజినీర్లు కొరత ఉంది. గ్యాంగ్‌మెన్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు కొరత కూడా ఉంది. అందుకే పనుల పర్యవేక్షణ ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆర్‌అండ్‌బీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపడతాం.
– జగన్నాధరావు,
డీఈఈ, పాలకొండ డివిజన్
ఈ ఫొటో వీరఘట్టం–జియ్యమ్మవలస మార్గంలో వీరఘట్టం బార్నాలవీధి వద్ద మరమ్మతులకు గురైన రోడ్డు. ఇలా రోడ్డుపై ఉన్న గుంతలను గతంలో ఆర్‌అండ్‌బీలో పని చేసే గ్యాంగ్‌మెన్‌లు పూడ్చేవారు. రోడ్డు పక్కన ఏవైనా చెట్లు పడిపోతే వాటిని తొలగించేవారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీలో గ్యాంగ్‌మెన్ వ్యవస్థను పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీలో క్లాస్–4 ఉద్యోగుల నియామకాలు నిలిచిపోయాయి. అధికారుల లేమితో ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రహదారుల భద్రతపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.
వీరఘట్టం – జియ్యమ్మవలస రోడ్డులో వీరఘట్టం బార్నాలవీధి వద్ద అధ్వానంగా ఉన్న రోడ్డు
జిల్లాలో 15 సెక్షన్లకు ఇద్దరు ఏఈలే..
13 సెక్షన్లలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులు
ఖాళీగా ఉన్న గ్యాంగ్‌మెన్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు పోస్టులు
అధికారుల కొరతతో రోడ్డు పనులపై కొరవడిన పర్యవేక్షణ
అన్యాక్రాంతమవుతున్న ఆర్‌అండ్‌బీ స్థలాలు


