ఏది వాస్తవం..! | - | Sakshi
Sakshi News home page

ఏది వాస్తవం..!

Jul 20 2026 12:38 AM | Updated on Jul 20 2026 12:38 AM

సాలూరు: గిరిజన విద్యార్థి మరణంలో వాస్తవమేంటో తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. సాలూరు మండలంలోని తోణాం పీహెచ్‌సీ పరిధి ఎగువమెండంగికి చెందిన తాడంగి జోయ్‌(16) మృతిపై ఈ నెల 17న సాక్షిలో జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి శీర్షికన వార్త ప్రచురిచమైంది. దీనిపై తాడంగి జోయ్‌ మూడు రోజుల పాటు తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వల్లనే మరణించాడని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. పి.విజయలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఈ నెల 19న 16 ఏళ్ల బాలుడు గంజాయికి బానిస? అనే శీర్షికన సాక్షిలో మరో కథనం ప్రచురితమైంది. గంజాయి వినియోగించడం వల్ల విద్యార్థి మరణించాడన్న వైద్యారోగ్యశాఖ ప్రకటన నేడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి వంటి మత్తుపదార్థాలు గిరిశిఖర గ్రామాల్లో నిజంగా లభ్యమవుతున్నాయా? నిజంగా వాటిని ఆ 16 ఏళ్ల బాలుడు వినియోగించాడా? తదితర అంశాలపై వాస్తవాలను తెలుసుకునేందుకు ఆదివారం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటు పోలీసులు, అటు వైద్యశాఖ సిబ్బంది ఎగువమెండంగి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డకు గంజాయి వంటి ఎటువంటి అలవాట్లు లేవని, జ్వరంతోనే మరణించాడని స్పష్టం చేసినట్లు సమాచారం. జ్వరం, కడుపునొప్పితో మరణించాడని మృతుని తండ్రి దనేల్‌ పోలీసులకు తెలిపినట్లు రూరల్‌ సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు. గంజాయిమత్తుకు బానిసై యువకుడు మరణించాడన్నది అవాస్తమని ఆదివారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి గంజాయి వంటి మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల మరణించాడన్న వైద్యారోగ్యశాఖ ప్రకటన అవాస్తవమని పోలీసుశాఖ తన ప్రకటన ద్వారా స్పష్టంచేసింది. ఆ గిరిజన విద్యార్థి పదవ తరగతిలో ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుని 503 మార్కులు సాధించాడు. తమ బిడ్డకే కాదు. గ్రామంలో ఎవరికీ ఇటువంటి అలవాట్లేమీ లేవని మృతుడి తల్లిదండ్రులు విచారణలో స్పష్టం చేశారు.

గిరిజన విద్యార్థి మృతి అంత చులకనా?

ఓ గిరిజన విద్యార్థి మరణించిన తరువాత ఎటువంటి శవ పంచనామా నిర్వహించకుండా, పూర్తివాస్తవాలు తెలుసుకోకుండా గంజాయి వంటి మత్తుపదార్థాలు వినియోగించి మరణించాడని వైద్యారోగ్యశాఖ ఏ విధంగా ప్రకటన విడుదల చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా ,పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా ఎలా ప్రకటిస్తారని మృతుని తండ్రి ప్రశ్నిస్తున్నాడు. చనిపోయిన గిరిజన విద్యార్థిపై మాయని మచ్చను వేసే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ గిరిజన విద్యార్థి మరణమంటే అధికారులకు ఇంత చులకనా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయని, సరైన ఆధారాలు విచారణ లేకుండా ఓ గిరిజన యువకుడి మరణంపై అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని గిరిజన నాయకులు కోరుతున్నారు.

గిరిజన విద్యార్థి మరణంలో మతలబు

గంజాయి వినియోగంతో మరణించాడని ప్రకటించిన డీఎంహెచ్‌ఓ

వైద్యారోగ్యశాఖ ప్రకటనను ఖండించిన పోలీస్‌ శాఖ

గంజాయి మత్తుతో మరణం అవాస్తవమని ప్రకటించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement