పాలకొండ: పట్టణంలో నిర్వహిస్తున్న జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం స్వామి కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి పూజలు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా జడ్జి సత్యారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు న్యాయవాదులు రామోహన్, మునిస్వామి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు విశ్వనాథం దాస్ ఆలయ చరిత్రను భక్తులకు వివరించారు. సోమవారం హీరాపంచమి సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను దేవదాయశాఖ అధికారులు చేపట్టారు. వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో పరమేశ్వరి తెలిపారు.
భారీగా మార్కెట్‌కు చెట్టుపనస
సీతంపేట: స్థానిక వారపు సంత మార్కెట్‌కు ఆదివారం భారీగా చెట్టుపనస పండ్లను గిరిజనులు విక్రయానికి తీసుకువచ్చారు. ఎక్కువ మంది వాటిని తీసుకురావడంతో మార్కెట్‌లో ఒక్కో పండు తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చిందని గిరిజనులు తెలిపారు. గత వారం ఒక్కొక్కటి రూ.60 నుంచి 150 వరకు సైజును బట్టి విక్రయించగా ఈ వారం రూ.50 నుంచి 100 వరకు మాత్రమే అమ్మకాలు జరిపామని గిరిజనులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారని గిరిజనులు వాపోతున్నారు.
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపల వేట అధికారికంగా ప్రారంభమైంది. గత కొంత కాలంగా లీజు సొమ్ము చెల్లించకపోవడంతో ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో ఉంది. ఇటీవల లీజు సొమ్ము ప్రభుత్వానికి చెల్లించడంతో అన్ని గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు రిజర్వాయర్‌లో చేపల వేట సాగిస్తున్నారు.
తెర్లాం: మండలంలోని నందబలగ పరిసర ప్రాంతాల్లో శనివారం తిష్టవేసిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయం బాడంగి మండలం పినపెంకి గ్రామం వైపు వెళ్లిపోయాయి. శనివా రం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నందబలగ గ్రామ పరిసర పొలాల్లోను, మామిడి తోటలో ఎనిమిది ఏనుగులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఏనుగుల గుంపు గ్రామానికి చెందిన పలువురి రైతుల చెరకు పంటను ధ్వంసం చేశాయి. చెరకు పంటను తినేయడంతో పాటు, కాళ్లతో తొక్కేయడంతో పంట నాశనమైయిందని గ్రామానికి చెందిన రైతులు లబోదిబోమంటూ విలపిస్తున్నారు. పంటలు నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా తమకు నష్టపరిహారం అందజేయాలని వారంతా అధికారులను కోరుతున్నారు. ఆదివారం ఉదయం నందబలగ–పినపెంకి రోడ్డు మీదుగా ఏనుగుల గుంపు పయనించి పినపెంకి సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లిపోయా యి. దీంతో నందబలగ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
కారాడ వైపు తరలిన ఏనుగులు
బాడంగి: మండలంలోని శివారు గ్రామం పినపెంకి గ్రామ పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు ఆదివారం చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆ పరిసరాల్లో సంచరించిన ఏనుగులు తిరిగి బొబ్బిలి మండలం కారాడ వైపు వెళ్లాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సూర్యకుమారి అప్రమత్తమై తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామంలోకి వెళ్లకుండా గస్తీ కాశారు.


