● యాచకురాలి పాడె మోసిన నగరకమిషనర్
పాలకొండ రూరల్: ఇటీవల పాలకొండ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పీవీ.నూకరాజు మనసున్న వ్యక్తిగా పట్టణ వాసుల అభినందనలు పొందారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం పాలకొండ వచ్చిన ఓ యాచకురాలు పురవీధుల్లో బిచ్చమెత్తుతూ జీవనం గడిపేది. తనకంటూ ఎవరూ లేకపోవడం, మతిస్థిమితం సక్రమంగా లేక రోడ్ల పక్కనే కాలం గడిపేది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్థానిక నాగవంశపు వీధి కూడలిలో గాంధీ విగ్రహం వద్ద తనువు చాలించింది. విగతజీవిగా పడిఉన్న యాచకురాలి మృతి విషయం తెలుసుకున్న కమిషనర్ పరిస్థితి చూసి చలించిపోయారు. తన సిబ్బంది, పోలీసుల సహకారంతో ఆమె అత్యక్రియలకు తానే స్వయంగా సిద్ధమయ్యారు. ఎక్కడో పుట్టి ఇక్కడ అనాథ శవంగా మారిన యాచకురాలికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. కమిషనర్ నేరుగా ఆమె పాడెను భుజానికి ఎత్తుకుని దాదాపు కిలోమీటరు మేర దూరంలో ఉన్న రుద్రభూమికి చేర్చారు. నూతన వస్త్రాలు కట్టబెట్టి, పూలతో అలంకరించి ఖననం చేపట్టారు. ఈ ఘటన చూసిన స్థానికులు కమిషనర్ మంచి మనసుకు ఫిదా అయ్యారు.


