ఎన్నికలున్నాయ్‌.. ఎరువులు మాకే ఇచ్చెయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలున్నాయ్‌.. ఎరువులు మాకే ఇచ్చెయ్‌!

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

ఎన్నికలున్నాయ్‌.. ఎరువులు మాకే ఇచ్చెయ్‌!

కొరత లేదంటున్నా...

సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు:

పార్వతీపురం మన్యం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన వేళ రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాగు పనుల ఆరంభం సమయంలో రైతులకు సకాలంలో అందాల్సిన ఎరువులు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఎరువులను తమ ఆధీనంలో నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ద్వారా డీలర్లకు చేరాల్సిన ఎరువులు.. రైతుల చేతికి చేరకముందే కొందరు రాజకీయ నాయకుల గోదాములకు మళ్లుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తమ వద్ద నిల్వ చేసిన ఎరువులను రైతులకు పంపిణీ చేసి, స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కోసం డీలర్ల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరు రైతులు ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరుగుతున్నా ఎరువులు దొరకడం లేదని వాపోతున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్‌ గోదాముల్లో భారీగా ఎరువుల నిల్వలు ఉన్నాయనే ప్రచారం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ఇతర జిల్లాల నుంచి నకిలీలు కూడా తీసుకొచ్చి, వ్యాపారులు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

ఎరువుల పంపిణీలో ‘స్థానిక’ నాయకుల ఒత్తిడి

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మళ్లింపు

వ్యాపారుల వద్ద కూడా అక్రమంగా లభ్యమవుతున్న బస్తాలు

నకిలీ ఎరువుల చెలామణిపై అనుమానాలు

సాలూరు నియోజకవర్గంలోని మావుడి ఆర్‌.ఎస్‌.కె పరిధి కొట్టుపరువు గ్రామానికి సంబంధించిన సత్తి శ్రీనివాస్‌ రెడ్డి భవనంలో అనధికారికంగా ఎరువుల బస్తాలు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 1,596 బస్తాలను రెవెన్యూ, పోలీస్‌, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అధిక భాగం నకిలీ ఎరువులు ఉన్నట్లు సమాచారం. మక్కువ మండలానికి చెందిన ఓ వ్యాపారి వీటిని కొన్నాళ్లుగా తెప్పిస్తున్నట్లు తెలిసింది. ఇతర జిల్లాల నుంచి రూ.700కు కొనుగోలు చేసి, ఇక్కడ రూ.1,800 చొప్పున విక్రయిస్తున్నట్లు రైతుల మాటల ద్వారా తెలుస్తోంది. వాటి నమూనాలు పరిశీలనకు పంపకుండా అధికార పార్టీకి చెందిన నాయకులు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నట్లు భోగట్టా.

ఇటీవల పంచాది గ్రామంలోని ఓ ఇంట్లో 240 బస్తాల ఎరువులను గుర్తించారు. రైతులంతా తమ ఆధార్‌ కార్డులతో కొనుగోలు చేసి, ఒక చోట నిల్వ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇన్ని బస్తాలు ఒకే చోట ఉండటంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎకరాకు ఒక బస్తా చొప్పున మాత్రమే రైతు ఆధార్‌, ఓటీపీ ఆధారంగా ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇదే నియోజక వర్గానికి చెందిన రైతుకు 15 ఎకరాలు ఉంది. ఆయనకు 13 బస్తాలు ఇవ్వనున్నట్లు చూపగా.. ప్రస్తుతం మూడే బస్తాలు ఇచ్చారని సదరు రైతు చెబుతున్నాడు.

గత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలో 43,896 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగం అయ్యాయి. ప్రస్తుత ఏడాదిలో పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని 46,100 మెట్రిక్‌ టన్నులు అవసరం అని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ఎరువుల కొరత లేదని, అవసరానికి అనుగుణంగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో మాత్రం రైతులకు చేరాల్సిన ఎరువు... పెద్దలకు వెళ్తోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయానికి అత్యంత కీలకమైన సమయంలో ఎరువుల కొరత ఏర్పడితే పంటల సాగు ఆలస్యం కావడంతో పాటు దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పంపిణీలో పారదర్శకత పాటించాలని, రైతులకు న్యాయంగా సరఫరా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి ఎన్నికల ప్రయోజనాల కోసం నిల్వలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమైతే, అది రైతుల హక్కులను కాలరాయడమే అని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement