సీతానగరం: మండలకేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చినభోగిలి గ్రామంలోని పైడివీధి కుటుంబాలకు తాగునీరు కల్పించనందుకు నిరసనగా బుధవారం గ్రామ సచివాలయం ఎదుట సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత మహిళలు కంఠ భారతి, జుమ్ము లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గ్రామంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా చినభోగిలిలోని అన్నివీధులకు తాగునీరు సౌకర్యం కల్పించి ఒక్క పైడి వీధికి తాగునీరు సరఫరా చేయకపోవడం దుర్మార్గమన్నారు. పాలకులు తాగునీరు సరఫరా అందిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖాళీబిందెలతో చేసిన నిరసన అనంతరం పంచాయయితీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పైడివీధి మహిళలు బుద్ధ లక్ష్మి, గురాల గంగమ్మ, జమ్ము చిన్నమ్మి, గురాల నరసింహులు, నాయకులు ఆర్.లక్ష్మునాయుడు, సీహెచ్ కృష్ణ, ఈశ్వరరావు, జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.


