పార్వతీపురం: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల బరువు, ఎత్తు, గ్రోత్ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, తప్పుడు వివరాలు నమోదుచేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై అన్ని నివేదికలు ఈ–ఆఫీస్, గూగుల్ ఫార్‌మ్స్ లేదా ఎకై ్సల్ ద్వారా మాత్రమే సమర్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు, పరిశుభ్రత, పోషకాహారం, తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం, ప్రీ–స్కూల్ కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. వచ్చే సమీక్ష నాటికి అన్ని లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఎ+ గ్రేడ్ సాధించేలా అధికారులు కృషిచేయాలని, ఆహారపు అలవాట్లలో మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్ హెల్త్ ఐడీలు(అభా), పోషణ్ ట్రాకర్, కిశోరీ వికాసం కార్యక్రమాలను వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, జిల్లా ఎన్‌సీడీ పీఓ డా.టి.జగన్‌మోహన్, తదితరులు పాల్గొన్నారు.


