● 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
● జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
విజయనగరం అర్బన్: భారతీయ విమానయాన రంగంలో మరో అద్భుత ఘట్టానికి వేళైంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ భోగాపురం వద్ద అత్యాధునిక హంగులతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రంగానే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్ధిక ప్రగతికి, పారిశ్రామిక విప్లవానికి, స్థానిక ఉపాధి అవకాశాల సృష్టికి ప్రధాన చోదక శక్తిగా నిలవనుంది.
చట్టబద్ధ అనుమతులు పూర్తి
ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం అనంతరం తక్షణమే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుఉ వీలుగా అన్ని కీలక ఆమోదాలు లభించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆమోదాలు, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్, కస్టమ్స్ నోటిఫికేషన్లు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) క్లియరెన్సులు పూర్తయ్యాయి.
ప్రాంతీయ, రహదారి అనుసంధానం
ఈ ఎయిర్‌పోర్ట్ కేవలం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకే కాకుండా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల ప్రజలకు ప్రధాన విమానయాన కేంద్రంగా మారనుంది. ప్రయాణికులు సులభంగా విమానాశ్రయానికి చేరుకునేందుకు విశాఖపట్నం నుంచి 7 అప్రోచ్ రోడ్లతో కూడిన అధునాతన హైవే కనెక్టివిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సిద్ధం చేశాయి. ఇన్నాళ్లూ వెనుకబడిన జిల్లాగా ఉన్న విజయనగరం..ఈ విమానాశ్రయం ఏర్పాటుతో రాష్ట్రానికే వెన్నెముక జిల్లాగా మారి సరికొత్త అభివృద్ధి బాటలో పయనించనుంది.
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
ప్రముఖ జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంది. భారీ విమానాలు సైతం సులభంగా రాకపోకలు సాగించేలా 3,800 మీటర్ల పొడవుగల ‘కోడ్ 4 ఈ’ రన్‌వేను సిద్ధం చేశారు. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా ఈ ఎయిర్‌పోర్టును రూపొందించగా భవిష్యత్తులో దశలవారీగా 4 కోట్ల మందికి పైగా సేవలు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. స్థానిక వ్యాపార, పారిశ్రామిక ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రత్యేకా కార్గో టెర్మినల్ సదుపాయాలు కల్పించారు.


