పార్వతీపురం రూరల్: అగిరిపల్లిలోని ఫీల్ స్కూల్‌లో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన ’రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఏ) పారా స్పోర్ట్స్ మీట్–2026’లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా నుంచి ఏడుగురు పోటీల్లో పాల్గొనగా.. ఐదుగురు పతకాలు సాధించారు.బలిజిపేట మండలానికి చెందిన సాసుబిల్లి శివకుమార్ (టీ–42) షాట్‌పుట్, డిస్క్ త్రో ఈవెంట్లలో రెండు రజత పతకాలు సాధించాడు. సీతంపేట మండలానికి చెందిన అంధత్వ (లో విజన్) విద్యార్థిని మండంగి ప్రమీల 100, 200 మీటర్ల పరుగులో రెండు రజతాలు, లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించింది. అలాగే సీతానగరం మండలం విద్యార్థి మామిడి సాయికుమార్ (టీ–36) షాట్‌పుట్‌లో రజతం, భామిని మండలానికి చెందిన ఆరిక రఘువరన్ (టీ–44) 200 మీటర్ల పరుగులో రజతం, పాలకొండ మండలం విద్యార్థి సంజయ్ కుమార్ (టీ–47) 200 మీటర్ల పరుగులో రజత పతకం కై వసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు వారికి ఎస్కార్ట్‌గా వ్యవహరించిన ఐఈఆర్‌పీలను డీఈఓ పి.బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ బి.రాజ్‌కుమార్, జిల్లా సహిత విద్యా కో–ఆర్డినేటర్ పి.భానుమూర్తి బుధవారం ఒక ప్రకటనలో అభినందించారు.


