కొనసాగుతున్న విచారణ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విచారణ

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

సాలూరు: తోణాం పీహెచ్‌సీ పరిధి ఎగువమెండంగి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి తాడంగి జోయ్‌(16) మృతిపై విచారణ కొనసాగుతోంది. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పద్మావతి, రూరల్‌ ఎస్‌ఐ రవీంద్రరాజు మంగళవారం వేర్వేరుగా గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని పద్మావతి తెలిపారు. విద్యార్థి జ్వరం, కడుపునొప్పితోనే మరణించాడని, గంజాయి వంటి మత్తుపదార్థాలు సేవించలేదని గ్రామస్తులు తెలిపినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మన్యంలో బైక్‌టూరిజం

పార్వతీపురం: జిల్లాలోని ప్రకృతి రమణీయ అటవీ ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ ‘బైక్‌టూరిజం’ను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 30 కిలోమీటర్లకు పైబడిన అటవీ మార్గాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌ పాయింట్లు, విశ్రాంతి కేంద్రాలను గుర్తించి నివేదికలు అందజేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. సచివాలయ సిబ్బందితో ప్రకృతి ప్రాంతాల వీడియోలు చిత్రీకరించి ప్రచారం చేపట్టాలన్నారు. పర్యాటకులకు స్థానిక ప్రకృతి ఫలాలు, తినుబండారాలు, సురక్షిత బససౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో బైక్‌ టూరిజం మార్గాలను గుర్తించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓలు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఆర్డీఓ కె.మాధురి, డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూన, రెవెన్యూ, డ్వామా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

రీ సర్వే వేగవంతం చేయాలి

పార్వతీపురం: జిల్లాలో నెట్‌వర్క్‌ సౌకర్యం లేని గ్రామాల్లో రీ–సర్వే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వేశాఖ అధికారులు, డ్రోన్‌ డిస్టినేషన్‌ కంపెనీ ప్రతినిధులు, సర్వేయర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. డేటా సేకరణ, ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ ప్రక్రియ, సాంకేతిక సమస్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. మూడు గ్రామాల సర్వే డేటా, కంప్యూటరీకరణ ప్రక్రియను పరిశీలించి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు కచ్చితమైన భూ రికార్డులు అందించేలా నిర్ణీత గడువులోగా రీ–సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సర్వేశాఖ సహాయ సంచాలకులు విఘ్నేశ్వరరావు పాల్గొన్నారు.

పార్వతీపురం యువకుడికి కరోనా

విశాఖ కేజీహెచ్‌లో ప్రత్యేక ఐసోలేషన్‌లో చికిత్స

పార్వతీపురం రూరల్‌: మన్యం జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం విశాఖ నగర శివార్లలోని పెందుర్తి ప్రాంతంలో సముద్రపు చేపలకు సంబంధించిన వ్యాపార సంస్థలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మలేరియా జ్వరంతో బాధపడుతున్న యువకుడికి ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి (కేజీహెచ్‌కు) తరలించారు. అక్కడి వైద్యులు యువకుడి రక్త నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడిని కేజీహెచ్‌లోని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో బాధితుడు పార్వతీపురం మండలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, దాదాపు ఏడాది కాలంగా సొంత గ్రామానికి రాలేదని తేలింది. ఈ నేపథ్యంలో మంగళవారం తలెత్తిన పలు అనుమానాలపై స్పందించిన మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు లేవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement