● ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కరువు
● బెడ్లు లేక అవస్థలు
● 95 ఓపీలో 40మందికి పైగా జ్వరాల నమోదు
సాలూరు: మండలంలోని తోణాం పీహెచ్‌సీకి అనారోగ్యంతో వస్తున్న రోగుల కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేక రోగుల బాధ వర్ణనాతీతంగా ఉంది. పీహెచ్‌సీకి రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. సుమారు వంద వరకు రోజుకు ఓపీ ఉంటుందని వైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. ఆదివారం ఒక్కరోజే పీహెచ్‌సీకి సుమారు 95 ఓపీ రాగా అందులో 40మందికి పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి. అయితే చికిత్స కోసం పీహెచ్‌సీకి వచ్చిన రోగులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్‌సీలో 6 బెడ్లు మాత్రమే ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగుల తాకిడి దృష్ట్యా మరో రెండు బెడ్లను వైద్యులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఒక బెంచిపై అనారోగ్యంతో ఓ చిన్నారి పడుకోగా అదే బెంచి చివరన అనారోగ్యంతో ఉన్న తల్లి, అనారోగ్యంతో ఉన్న తన బిడ్డను కూర్చోబెట్టుకుంది. మరో బెడ్‌పై ఉన్న పేషెంట్ మంచాన్ని తన బంధువు చీపురుతో తుడిచి శుభ్రం చేస్తున్నాడు. ఈ విధంగా ఆస్పత్రిలో ఎటువైపు చూసినా రోగులు, వారి వెంట వచ్చిన బంధువులు, అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులు, వారిని తీసుకువచ్చిన ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంల బాధలే కనిపిస్తున్నాయి.
సొంత డబ్బు ఖర్చు చేస్తున్న వైద్యులు
పీహెచ్‌సీలో మందులు లేక కొన్ని ప్రత్యేక మందుల కోసం వైద్యులు తమ సొంత డబ్బు ఖర్చు చేసి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రి నిధులు విడుదలైన తరువాత ఈ డబ్బులు తాము తీసుకుంటామని వైద్యులు చెబుతున్నారు. అత్యంత దయనీయంగా ఆస్పత్రుల పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం చలించి సదుపాయల కల్పన వైపు అడుగులు వేయడం లేదని స్థానిక గిరిజనులు వాపోతున్నారు.


