
షెడ్యూల్ తెగలు, కులాల హక్కుల పరిరక్షణకు పటిష్ట చట్టాలు
బొబ్బిలి: షెడ్యూల్ తెగలు, కులాలకు చెందిన ప్రజల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన చట్టాలు పటిష్టమైనవని స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి హేమ స్రవంతి జానకిరామ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక కోర్టు ఆవరణ, ఎస్సీ బాలికల వసతిగృహంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌర హక్కుల రక్షణచట్టం(1955)షెడ్యూల్ కులాలు, తెగల అత్యాచారాల నివారణ చట్టం(1989)ప్రకారం ఆయా ప్రజల హక్కులు కాపాడడం, అత్యాచారాలు, దురాగతాలను నివారించడం, హక్కుల కల్పన,పునరావాసం వంటివి కల్పించడం జరుగుతుందన్నారు. వారి కోసం ప్రత్యేక న్యాయ విచారణ జరుగుతుందని చెప్పారు. వారిపై జరిగే నేరాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉపశమన చర్యలు తీసుకునేందుకు పటిష్టంగా చట్టాలున్నాయని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎం.ఆనందకుమార్, రుంకాన ప్రసాద రావు, పలువురు సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.