
అధ్యక్ష పీఠంపై తమ్ముళ్ల సమరం!
● ‘ప్రాంతాల’ మధ్య పోటీ
● పెరుగుతున్న ఆశావహులు
● తెరపైకి రెండు వేర్వేరు అధ్యక్షులు
● కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, పార్వతీపురం మన్యం:
అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పీఠంపై ‘తమ్ముళ్ల’ మధ్య ఆసక్తికర సమరం నడుస్తోంది. ప్రధానంగా అటు ఏఎస్‌ఆర్.. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోటీ ఏర్పడింది. ఈ సారి ఎలాగైనా అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని రెండు జిల్లాల నుంచి పలువురు పోటీ పడుతున్నారు. దీనిపై రెండు రోజుల కిందట విశాఖపట్నంలో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎవరికి వారు తమ వాణిని వినిపించారు. వాస్తవానికి అరకు పార్లమెంట్ స్థానం ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఈ పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. కొన్ని దఫాలుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే అరకు పార్లమెంట్ స్థానాన్ని కై వసం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అన్ని విధాలా బలమైన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధ్యక్ష పీఠం మళ్లీ ఎస్టీకి కేటాయిస్తారా, లేక మరో సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ అధ్యక్ష పదవిని ఎస్టీకి ఇస్తే.. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెరపైకి ఇద్దరు వేర్వేరు అధ్యక్షులు?
మరోవైపు అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించి అధ్యక్షులను నియమించాలన్న డిమాండ్ కూడా ఉంది. మన్యం జిల్లా పార్టీ అధ్యక్షునిగా బీసీ నాయకునికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతుండగా.. ఎస్టీకి ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి తదితరులు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వంలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలకు ప్రాధాన్యమివ్వాలని విప్, ఎమ్మెల్యే జగదీశ్వరి అడుగుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకే అధ్యక్ష పదవి కేటాయించాలని.. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడినే కొనసాగించాలన్న డిమాండ్లూ అటు నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ అధ్యక్షునిగా కె.శ్రవణ్‌కుమార్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కూడా అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో ఆశావహుల జాబితా పెద్దదే..
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఎక్కువ. పార్వతీపురం మన్యం జిల్లాలో కేవలం నాలుగు నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఎస్‌ఆర్‌కు, మన్యం జిల్లాలకు వేర్వేరు అధ్యక్షుల నియామకం తెరపైకి వచ్చింది. అటు ఎస్టీకి ఇచ్చేసినా.. ఇటు బీసీకి ఇవ్వాలని పలువురు పట్టుపడుతున్నారు. మన్యం జిల్లా నుంచి అధ్యక్ష పదవి రేసులో చాలా మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో మూడు ఎస్టీ, ఒక్కటి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ కారణంగా బీసీ, ఇతర సామాజిక వర్గాలకు ఎటువంటి సముచిత పదవులూ దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. బలమైన సామాజిక వర్గ నాయకులు తెర వెనుక పాత్రకే పరిమితమవుతున్నారు. ఈసారైనా ఆ పరిస్థితిని మార్చాలని పలువురు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ ఈ పదవి చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కురుపాం నియోజకవర్గం నుంచి వైరిచర్ల వీరేశ్‌చంద్రదేవ్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ గ్రంథాయల చైర్మన్ దత్తి లక్ష్మణరావు తదితరులు ఆశిస్తున్నారు. వీరేశ్‌చంద్రదేవ్ 2024 ఎన్నికల్లో కురుపాం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి క్షణంలో తోయిక జగదీశ్వరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అయిష్టంగానైనా పార్టీ గెలుపునకు ఆయన కృషి చేశారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే జగదీశ్వరి వర్గం.. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందన్న అసంతృప్తి వీరేశ్‌చంద్రదేవ్ వర్గీయుల్లో ఉంది. గోవా గవర్నర్ ఆశోక్ గజపతిరాజుకు ఈయన బంధువు కూడా. ఆ పరిచయంతోపాటు, వైరిచర్ల కుటుంబం నేపథ్యం ఆయనకు కలిసొస్తుందని సన్నిహితులు అంటున్నారు. ఇదే నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు కూడా పార్టీలో కీలక పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్రతో వీరికి బహిరంగంగానే విభేదాలు ఉన్నాయి. జగదీష్‌కు బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉంది. పార్టీ సీనియర్ నేత అయినప్పటికీ.. గత ఎన్నికలకు ముందు నుంచి బోనెల విజయ్‌చంద్ర ఏకపక్ష నిర్ణయాలతో ఆయన తెరమరుగయ్యారు. వీరితోపాటు.. మరికొంతమంది కూడా పార్టీలో ముఖ్య పదవుల కోసం పోటీ పడుతున్నారు.