
విఘ్నాలు తొలగిపోవాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: తెలుగు సంవత్సరంలో వచ్చే తొలి పండగ వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థశి సందర్భంగా ఉమ్మడి జిల్లాల ప్రజలకు మంగళవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ గణనాథుని చల్లని చూపుతో, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రెండు జిల్లాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. ఆ పార్వతీపుత్రుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగి, అంతటా విజయాలు సిద్ధించాలని కోరారు. పర్యావరణ హితంగా పండగను జరుపుకోవాలని, మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు పాటించాల్సిందే..
పార్వతీపురంటౌన్: వినాయక మంటపాల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని సబ్ కలెక్టర్ డా.ఆర్ వైశాలి స్పష్టంచేశారు. వినాయక చవితి పండగ నిర్వహణ, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఎస్పీ అంకితా సురానాతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైశాలి మాట్లాడుతూ మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదన్నారు. డీజే సౌండ్ సిస్టం నిషేధమన్నారు. తిరువీధి, అనుపోత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణ హితం దృష్ట్యా మట్టి విగ్రహాలను పూజించేలా చూడాలన్నారు.
స్థలాలు గుర్తించండి
పార్వతీపురం రూరల్: జిల్లాకు 80 పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, వీటిలో స్థలాలున్నచోట 68 భవనాల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం మంజూరు చేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. మిగిలిన 12 భవ నాల నిర్మాణానికి వెంటనే స్థలాలను గుర్తించి గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్ సహాయ కార్యనిర్వహణ ఇంజనీర్లను ఆదేశించారు. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షల నిధులతో పూర్తిచేయాలన్నారు. ఈ నెల 28, 29, వచ్చేనెల 2, 3 తేదీల్లో ఆదికర్మయోగి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ రామచంద్రరావు, ఐటీడీఏ ఏపీఓ మురళీకృష్ణ, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
యూరియా పంపిణీలో పక్షపాతం
కొమరాడ: మండలంలోని కెమిశీల రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీలో వ్యవసాయ సహాయకురాలు పక్షపాత ధోరణిపై రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆర్‌ఎస్‌కేకు 200 బస్తాల యూరియా వచ్చింది. కూటమి నాయకులు చెప్పినవారికే యూరియా బస్తాలు ఇవ్వడంతో సాధారణ రైతులు నిలదీశారు. గాజులుగూడ, తులసివలస, బంద వలస తదితర గ్రామాల రైతులు కూటమినాయకుల ఒత్తిడితో ఏఏఓ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. రైతులందరికీ యూరి యా అందజేయాలని డిమాండ్ చేశారు.
వంగర: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 2,500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు.

విఘ్నాలు తొలగిపోవాలి

విఘ్నాలు తొలగిపోవాలి

విఘ్నాలు తొలగిపోవాలి