
తల్లికి వందనం.. మాకేం సంబంధం..!
● వేలాది మందికి పథకం దూరం ● తల్లుల ఖాతాకు జమ కాని నగదు
● అధిక శాతం ‘కిల్లో స్వప్న’ పేరిటే..
● కొందరికి అర్హత చూపుతున్నా కలగని లబ్ధి
● పట్టించుకోని అధికారులు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం పొందడం లబ్ధిదారులకు ప్రహసనంగా మారింది. ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలు ఉన్నా.. అందరికీ వర్తింపజేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఒక్క మన్యం జిల్లాలోనే వేలాది మందికి పథకం లబ్ధిని దూరం చేసింది. వేరొకరి కరెంటు బిల్లులు ఆధార్‌తో లింకు కావడం, భూమి లేకున్నా ఉన్నట్టు చూపడం.. ఇలాంటి సమస్యలే కాక, తల్లుల పేర్లు కూడా మారిపోవడం గమనార్హం. సీతానగరం, పార్వతీపురం, పాలకొండ, కొమరాడ, కురుపాం.. ఇలా అనేక మండలాల్లో తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ పేరు నమోదు కావడం విశేషం. విద్యాసంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే.. అన్ని అర్హతలూ ఉండి, అధికారుల తప్పిదాల వల్ల పథకానికి దూరమైన తల్లులు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పాఠశాలకు వెళ్తే.. సచివాలయానికి వెళ్లాలని.. అక్కడికి వెళ్తే ఎంఈవో కార్యాలయంలో అడగాలని.. వారేమో డీఈవో కార్యాలయంలో కలవాలని.. ఇక్కడేమో.. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం ఇవ్వాలని.. ఇక్కడికి వచ్చేసరికి మళ్లీ పాఠశాలకో, సచివాలయానికో పోవాలని.. ఇలా ఏ ఒక్కరికీ సంబంధం లేనట్టు తప్పించుకుని తిప్పుతున్నారు. జిల్లాలో మొదటి విడతగా 1,08,951 మంది విద్యార్థులు పథకానికి అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. అర్హతలు ఉండి పథకం పొందని విద్యార్థులు ఇంకా వేల మంది మిగిలిపోయారు. కొందరికి ‘ఎలిజిబుల్’ అని జాబితాలో చూపిస్తోంది గానీ, డబ్బులు పడటం లేదు. మలి విడతలో నగదు జమ అవుతుందని అధికారులు చెప్పి పంపించేస్తున్నారు. ఏ ఒక్కరి నుంచీ స్పష్టమైన సమాధానం రాకపోవడంతో తల్లులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
మా కుమార్తె సీతానగరం జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతోంది. మాకు జమ కావాల్సిన తల్లికి వందనం నిధులు శ్రీదేవి అనే మరొకరి పేరిట జమైపోయాయి. వారిని అడిగితే తమకేమీ సంబంధం లేదని అంటున్నారు. అధికారులను కలసి వినతిపత్రం అందించాం.
– ఎం.పుష్పలత, విద్యార్థిని తల్లి, సీతానగరం
మాది పాపన్నవలస గ్రామం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం పథకం డబ్బులు ఇద్దరికీ రాలేదు. ఎవరిని అడిగినా సరిగ్గా స్పందించడం లేదు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశాం. – ఎ.సత్యవతి,
విద్యార్థుల తల్లి, సీతానగరం మండలం

తల్లికి వందనం.. మాకేం సంబంధం..!

తల్లికి వందనం.. మాకేం సంబంధం..!