
పొంగిన నదులు.. ఇబ్బందుల్లో గిరిజనులు
సాలూరు రూరల్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని గోముఖి, సువర్ణముఖి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కొండలపై కురిసిన వర్షాలకు దండిగాం, తోణాం గ్రామాలను కలుపుతూ ప్రవహిస్తున్న నదులు అకస్మాత్తుగా పొంగి ప్రవహించడం ప్రజలు ఇబ్బందులు పడడం సర్వసాధారణమైంది. తోణాం మీదుగా సువర్ణముఖి నదిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కాజ్‌వే నిర్మింపజేసి ఏజెన్సీ గ్రామాలకు నది ప్రవాహ ప్రమాదాలను కొంతవరకు నివారించగలిగారు. అలాగే దండిగాం వద్ద కాజ్‌వే పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర రూ.11 కోట్లు మంజూరు చేయించినా కూటమి పాలనలో ఆ నిధులు కాస్త వెనక్కి మళ్లాయి. ప్రస్తుతం దాదాపు 15 గిరిజన గ్రామాల ప్రజలు ఈ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం పొంగడంతో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం తోణాం వద్ద గోముఖి నది కాజ్‌వే పై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వినియోగించి వంతెనల నిర్మాణం పూర్తి చేయాలని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.