
పాఠశాల పక్కనే పశువుల అక్రమ రవాణా
కొమరాడ: మండలంలోని చిన మార్కొండపుట్టి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో పరశురాంపురం కేంద్రంగా అక్రమ పశు దందా జరుగుతోంది. కొంతమంది పశువుల అక్రమ రవాణా వ్యాపారులు పాఠశాల పక్కనే వందలాది పశువులు కడుతుండడం వల్ల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశాలోని రాయగడ, అమలబడి తదితర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల దూరం వాటిని నడిపించి గ్రామానికి తీసుకు వస్తున్న నేపథ్యంలో అవి నడవలేక రక్తస్రావంతో పాటు నీరసంతో పశువులు మృతి చెందడంతో ఆ పరిసర ప్రాంతంలో పశు కళేబరాల కుళ్లు కంపుతో పాటు దోములు, దుర్వాసన రావడంతో విద్యార్థులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటారని గ్రామస్తులు ఎంత చెప్పినా అక్రమ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాల పరిసరాల్లో అక్రమ పశుదందాను అరికట్టాలని వారంతా కోరుతున్నారు.