ప్రజలకు అండగా నిలవాలి
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు పడుతు న్న అన్ని వర్గాల ప్రజానీకానికి అండగా నిలిచి.. పోరాటాల ద్వారా వారి గొంతు కగా మారాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. తాడేపల్లిలో మంగళవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న రాజన్నదొర ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల వల్ల ప్రజలు, వివిధ వర్గాల వారు పడుతున్న ఇబ్బందులను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సర్పంచ్ తీర్మానాలు లేకుండా పనులు చేయిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు.. ఏకపక్షంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నదీ.. వ్యవసాయం, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, మొక్కజొన్నకు ధర లేకపోవడం, ఆరోగ్యం, నీటి పారుదల, భూములు, పీడీఎస్ బియ్యం, పింఛన్ల కోత తదితర అంశాల్లో సమస్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను వివరించామన్నారు.
గొందివలసలో 37 మందికి మలేరియా లక్షణాలు
సాలూరు రూరల్: మండలంలోని కొత్తవలస పంచాయతీ గొందివలస గ్రామంలో మలేరియా ప్రబలింది. మామిడిపల్లి పీహెచ్‌సీ డాక్టర్ శివకుమార్ తన వైద్య బృందంతో 86 మందికి రక్త పరీక్షలు చేయగా అందులో 37 మందికి మలేరియా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వారందరీకి అవసరమైన మందులు ఉచితంగా అందజేసినట్టు వైద్యాధికారి తెలిపారు. గ్రామానికి ఆనుకొని జలపాతం నీరు ఒక ప్రాంతంలో నిల్వ ఉండడం, అందులో దోమలు వృద్ధి చెందడమే దీనికి కారణమన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే యువత స్పందించి నీటి నిల్వలను మళ్లించారన్నారు.
వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు
పార్వతీపురంటౌన్: ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. వనమిత్ర కార్యక్రమం ద్వారా వాట్సాప్ గవర్నన్స్ తీసుకువచ్చిందని వివరించారు. ఫోన్ 95523 00009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెట్టగానే కావాల్సిన సేవలు అందుతాయన్నారు. పదోతరగతి ఫలితాలను హెచ్‌టీటీపీఎఫ్://బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్, హెచ్‌టీటీపీఎస్://ఏపీ ఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్ 1930కి కాల్‌చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు శక్తియాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు తమ మొబైల్ ఫోన్‌లో శక్తియాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
వాడపల్లి తిరుపతికి ఆర్టీసీ సర్వీసులు
విజయనగరం అర్బన్: కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి ఆర్టీసీ సర్వీసులను ప్రతి శుక్రవారం నడుపుతామని విజయనగరం డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరిన బస్సు శనివారం తెల్లవారు జామున 4 గంటలకు వాడపల్లి చేరుకుంటుందని, తిరిగి మరలా ఉదయం 9 గంటలకు వాడపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సుని వేశామని, టికెట్ ధర కేవలం రూ.1200 మాత్రమేనని తెలిపారు. టికెట్‌లను ఆర్టీసీ డిపోలో లేదంటే ‘ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఐఎన్’లో బుక్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం సెల్: 99592 25620, 94943 31213 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రజలకు అండగా నిలవాలి


