కొండలను పిండి చేసే ‘కంకరీచులు’
ఐఏఎస్‌లకు పని చెబుతున్న మండల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది
రాత్రి వేళల్లోనూ ఆకస్మిక దాడులు చేస్తున్న సబ్ కలెక్టర్లు
అక్రమంగా తరలి వెళ్తున్న ఇసుక, గ్రావెల్ వాహనాల పట్టివేత
వారే నేరుగా వస్తుంటే..
స్థానిక అధికారులు ఏం చేస్తున్నట్లు?
జిల్లాలో కిందిస్థాయి అధికారుల తీరుపై విమర్శలు
పాలకొండ–పార్వతీపురం ప్రధాన రహదారిలోని అట్టలి సమీపంలో కంకర లభ్యమయ్యే కొండను అక్రమార్కులు తవ్వేశారు. రాత్రివేళల్లో గుట్టుగా యంత్రాలతో తవ్వి, వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో కంకరను తరలిస్తున్నారు. ప్రతిరోజూ రూ.లక్షల్లో ఇక్కడ అక్రమ వ్యాపారం సాగుతోంది. ట్రాక్టరు లోడు రూ.1,500, టిప్పరు లోడు రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారు. సీతానగరం మండలం నిడగల్లు, ఇప్పలవలస, దయానిధిపురం, చినఅంకలాం, వెన్నెల బుచ్చింపేట రెవెన్యూ గ్రామాల పరిధిలో కొండలను తవ్వేస్తూ, కంకర తరలించుకుపోతున్నారు. కురుపాం మండలం మంతినవలస సమీపంలోనూ గుట్టల వద్ద మట్టిని తవ్వేస్తున్నారు. మక్కువ మండలం కాశీపట్నం తదితర ప్రాంతాల్లోనూ కంకర కింకరులు రెచ్చిపోతున్నారు.
సాలూరు, భామిని మండలాల్లోనూ గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా జిల్లా మొత్తం ఇసుక, గ్రావెల్ తవ్వకాలతో రూ.లక్షలు పోగేస్తున్నారు. పత్రికల్లో వస్తేనే రెవెన్యూ, మైనింగ్ అధికారులు రెండు రోజులు హడావిడి చేస్తున్నారు. తర్వాత షరా‘మూమూలు’గానే వదిలేస్తున్నారు. పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు చూపుతున్న చొరవలో కొంతయినా.. స్థానిక అధికారులు చూపిస్తే, తవ్వకాలకు కాస్తయినా బ్రేక్ పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆశిస్తున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం :
జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టి.. రాత్రి వేళ తరలిస్తున్నారు. ఇదంతా స్థానిక సచివాలయం, రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలి యకుండా జరుగుతుందా.. అన్నది ప్రశ్నార్థకమే! అక్రమార్కులకు స్థానిక అధికారులు, ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ ఇటీవల రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక, గ్రావెల్‌ను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ గతంలోనూ అర్ధరాత్రి సమయంలో నాగావళి నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక వాహనాలను పట్టుకున్నారు. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులుగా విధుల పట్ల ఉండాల్సిన అంకితభావానికి ఈ ఐఏఎస్ దంపతులు ఒక ఉదాహరణ. ఐఏఎస్ అధికారులై అయి ఉండి.. రాత్రి వేళ నిఘా పెట్టి ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఆర్డర్లు వేయాల్సిన వారు.. తనిఖీలతో అక్రమార్కులకు హడలెత్తిస్తున్నారు. వారే అంత చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న రెవెన్యూ, పోలీసు, సచివాలయం, గనుల శాఖ అధికారులు ఇంకెంత చేయాలి? ఎంతో కాలం నుంచి అక్రమంగా ఇసుక, గ్రావెల్ పెద్ద ఎత్తున తరలిపోతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నారన్న ప్రశ్నలు ప్రజల నుంచి, కొందరు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి.
జిల్లాలో ప్రధానంగా నాగావళి, వంశధార తీరాలు ఇసుకాసురులకు కాసులు కురిపిస్తున్నాయి. కొమరాడ, పాలకొండ పరిధిలోని నాగావళి నదిని యథేచ్ఛగా దోచేస్తున్నారు. కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం వద్ద ఇసుక తవ్వకాల కోసం ఏకంగా రహదారినే నిర్మించుకోవడం గమనార్హం. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో ఇసుక తరలిపోకుండా ట్రెంచ్‌లు కూడా తవ్వారు. అవేవీ అక్రమార్కులకు అడ్డు కావడం లేదు. కొద్దిరోజుల కిందట అందిన సమాచారం మేరకు ఇక్కడ రాత్రివేళలో మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అప్పటికే ఇసుకను తవ్వుతున్న పొక్లెయిన్‌ను, రెండు లారీలను పట్టుకుని సీజ్ చేసి, పోలీసులకు అప్పగించారు. పాలకొండ మండలంలోని గోపాలపురం, మంగళాపురం, అంపిలి, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ జోరుగా ఇసుక తవ్వకాలు సాగుతున


