యథేచ్ఛగా వృక్షాలు నరికివేత వన్య ప్రాణుల వేట
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
బొల్లాపల్లి: అటవీ సంపదకు రక్షణ కరువైంది. కొందరు దుర్మార్గులు, మాంస భక్షకులు వన్యప్రాణులను యథేచ్ఛగా వేటాడుతున్నారు. దీంతోపాటు అటవీ ప్రాంతంలో కలప అక్రమంగా తరలి వెళ్తుందని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోపాటు ఆ శాఖ పరిధిలోని కొందరు ఉద్యోగులు అక్రమార్కులకు, పరోక్ష సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేళ్లవాగు సెక్షన్ పరిధిలో వన్యప్రాణుల వేట కోసం ఇటీవల వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి గేదెలు మృతి చెందాయి. ప్లాంటేషన్‌తోపాటు కొన్ని ప్రదేశాల్లో పెద్ద వృక్షాలు కలపకు అక్రమార్కులు తరలిస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు. వినుకొండ రేంజ్ పరిధిలో బొల్లాపల్లి మండలం అటవీ విస్తీర్ణం అధికం. సుమారు 33 వేల హెక్టర్ల లో అడవులు విస్తరించి ఉన్నాయి. ఆ శాఖ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తుంది. తగినంత సిబ్బంది లేక పర్యవేక్షణ లేకపోవడంతో చెలరేగిపోతున్నారని వన్య ప్రాణులను కరెంటు తీగలు ఏర్పాటు చేసి వేటాడుతున్నారు. నీటి కుంటలు, వాగులకు సమీపంలో కరెంటు తీగలు ఏర్పాటు చేసి వధించి మాంసభక్షకులకు విక్రయాలు జరుపుతున్నారని, ఈ అడవుల్లో మనుబోతులు, దుప్పి, జింక, నెమలి వంటి అటవీ జంతువులు దుర్మార్గుల వేటకు బలవుతున్నాయి. పిడుగురాళ్ల, మార్కాపురం, చేజర్ల వంటి ప్రాంతాలకు వన్యప్రాణుల మాంసం మాంసభక్షకులకు అక్రమార్గంలో తరలుతుంది. పూర్తిస్థాయిలో ఆ శాఖ అధికారులు పర్యవేక్షణ ఉంటే అటవీ సంపద అక్రమ బాట పట్టదని స్థానికులు అంటున్నారు. దుర్మార్గుల నుంచి వన్యప్రాణులను కాపాడాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అటవీ సంపద అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. వన్య ప్రాణులను వధించినా, కలప అక్రమంగా తరలించినా అటవీ హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. మండలంలోని కొన్ని ప్రదేశాల్లో వన్యప్రాణుల వేట, కలప అక్రమంగా తరలింపు మా దృష్టికి వచ్చాయని, పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, విచారణ చేపట్టామని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.
–సి.మాధవరావు,
వినుకొండ రేంజ్ అధికారి


