ఈపూరు : విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి జేఎల్‌ఎం పిన్నెబోయిన వెంకటేష్ (32) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని బొగ్గరం గ్రామ సమీపంలోని పొలాలలో సోమవారం ఉదయం జరిగింది . విద్యుత్ శాఖ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పిన్నెబోయిన వెంకటేష్ స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో పరిధిలోని బొమ్మరాజుపల్లి గ్రామానికి జేఎల్‌ఎంగా విధులు నిర్వర్తిస్తూ, బొగ్గరం గ్రామానికి ఇన్చార్జి జేఎల్‌ఎంగా పనిచేస్తున్నాడు. బొగ్గరం గ్రామానికి చెందిన రైతు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎడ్జ్ ఫ్యూజ్ వేసేందుకు వెంకటేష్‌కు ఫోన్ చేయగా ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకున్న వెంకటేష్ మరమ్మతులు చేసేందుకు ఏఈ అనుమతితో లైన్ క్లియరెన్స్ కోసం సబ్‌స్టేషన్ షిప్ట్ ఆపరేటర్‌కు ఫోన్ చేసి విద్యుత్ స్తంభం ఎక్కటంతో 11కేవీ విద్యుత్ తీగలు తగిలి కిందపడి గుండె కింది భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని మతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య శ్రీలక్ష్మి, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె వేణుగోపాల్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ ఏడీ ప్రసాద్ విద్యుత్ లైన్లను, బ్రేకర్లను పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించారు.


