వాహనాలకు దారి ఇస్తేనే మ్యుటేషన్ చేస్తారంట..
పట్టణంలోని మోర్‌సెంటర్‌లో ఓ ప్రైవేటు భవనంలో మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఉచిత కంప్యూటర్ శిక్షణ నిర్వహిస్తుండగా గత రెండేళ్లుగా అది మూతపడింది. దీని వలన విద్యార్థులు, యువత నష్టపోతున్నారు. ఆపేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకొని కంప్యూటర్ శిక్షణ తిరిగి కొనసాగించాలి.
–షేక్ కరిముల్లా,
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, నరసరావుపేట
మేము పదిమందిమి యూనియన్ బ్యాంకు శాఖ ద్వారా రూ.8.80లక్షల రుణం తీసుకున్నాం. అయితే యానిమేటర్ మస్తాన్‌వలి మా అందరి వద్ద డబ్బులు తీసుకొని అందులో రూ.4.40లక్షలు మాత్రమే చెల్లించాడు. ఈ విషయం గతేడాది మే నెలలో బయటపడింది. వెంటనే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయగా అతడిని విచారించి వదిలేశారు. కలెక్టర్‌కు విన్నవించి కార్యాలయం చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదు.
–గోవిందు వీరమ్మ, నండూరి కుమారి
నాగమ్మ గ్రూపు, ఇనిమెట్ల, రాజుపాలెం మండలం
నాకు నడికుడి గ్రామంలో 1.06ఎకరాల పొలం ఉంది. సర్వేలో 30సెంట్లు తగ్గింది. ఆన్‌లైన్‌లో సరిచేయాలంటూ మ్యుటేషన్ పెట్టాం. గత నెల 20న అర్జీ అందజేశాం. ఇక్కడకు వస్తే సరిచేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చినా మండల అధికారులు మ్యుటేషన్ చేయట్లేదు. అలాగే ఆ పొలానికి వెళ్లే బాటలో కొందరు ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీలకు వెళ్లే హైలోడు వాహనాల వలన పొలంలోని పంటకు నష్టం జరుగుతుంది. సమస్యలు పరిష్కరించాలని గత జూన్ నుంచి కలెక్టర్‌కు అర్జీ అందజేసి తిరుగుతున్నా పరిష్కారం లభించలేదు. ఇటుక బట్టీల వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇస్తేనే నీకు పొలం మ్యుటేషన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం?
–కొప్పుల కృష్ణారావు, మన్స్‌షాపేట నారాయణపురం, దాచేపల్లి మండలం


