మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.. సర్‌! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.. సర్‌!

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.. సర్‌!

ప్రహసనంలా అర్హత నిరూపణ ధ్రువీకరణ పత్రాల సమర్పణకు పోటెత్తుతున్న ఓటర్లు జిల్లాలో 2,46,600 మందికి నోటీసులివ్వాలని నిర్ణయం ఇప్పటి వరకు 68,932 మందికి పంపిణీ మొదటి నోటీసుకు ఈ నెల 30 వరకు, రెండో దానికి సెప్టెంబర్‌ 28 వరకు గడువు ఆలోగా స్పందించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం

ఇప్పుడేం చేయాలి?

సత్తెనపల్లి: జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) సర్వే ఒక ఎత్తయితే.. నోటీసులు అందుకుంటున్న వారు అర్హత నిరూపించుకోవడం మరో ఎత్తుగా మారింది. సర్‌ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్‌ కాని, వివరాలు తప్పుగా ఉన్న, అనుమానాస్పదంగా ఉన్న, గత సర్‌ జాబితాతో పోల్చితే ప్రస్తుత జాబితాలో ఇంటిపేరు, అక్షరదోషాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించిన 2,46,600 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు బీఎల్‌ఓల ద్వారా నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 68,932 మందికి నోటీసులు పంపిణీ చేశారు. పోలింగ్‌ బూత్‌లవారీగా జనరేట్‌ చేసిన నోటీసులను తేదీలవారీగా ఓటర్లకు అందజేసి, విచారణతో పాటు అర్హత నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించే కార్యక్రమం జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది. ఏఈఆర్‌ఓ సచివాలయాల్లోని బీఎల్వోల వద్దకు ఓటర్లు తమ అర్హత నిరూపణ కోసం ధ్రువీకరణ పత్రాలను తీసుకువెళుతుండడంతో ఆయా కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సవరణ ప్రక్రియ సెప్టెంబర్‌ 21 వరకు కొనసాగుతుందని, ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు భరోసా ఇస్తున్నారు. ఓట్ల సర్వే కోసం గత నెలలో పనులన్నీ వదులుకొని వచ్చి 2002 ఓట్ల జాబితాతో పాటు ఓటు హక్కుకు అవసరమైన ధ్రువపత్రాలను అధికారులకు ఇచ్చామని బాధితులు వాపోతున్నారు. ఓటు భద్రమేనని ఊపిరి పీల్చుకుంటే.. మళ్లీ అక్షరదోషాలు, ఇంటిపేరు మార్పు అంటూ అధికారులు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు.

ఓటర్ల ఆవేదన

‘‘కార్యాలయాల చుట్టూ తిరగాలంటే ఎలా సార్‌? మా ఓటు కష్టాలకు విముక్తి ఎప్పుడు ‘సర్‌’?’’ అంటూ నోటీసులు అందుకున్న ఓటర్లు అధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంటిపేరు, అక్షరదోషాలు ఉండి నోటీసులు అందుకున్న ఓటర్లు అధికారుల వద్ద హాజరవుతున్నారు. ఈ నెలాఖరు వరకు తొలి నోటీసుకు సంబంధించి గడువు ఉండగా, హాజరుకాని వారికి సెప్టెంబర్‌ 28 వరకు రెండో నోటీసుకు హాజరు కావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ముసాయిదా జాబితా విడుదలైన నేపథ్యంలో ప్రతి ఓటరు తన పేరు ఉందా? లేదా? అనేది తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఇందుకు ఈ–పోర్టల్‌, ఎన్నికల కమిషన్‌ మొబైల్‌ యాప్‌లో చూసుకోవచ్చు. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా ఎన్నికల అధికారులకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు కూడా నిబంధనల ప్రకారం ఫారం–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోతే నిర్ణీత గడువులో అభ్యంతరాలను సంబంధిత అధికారులకు అందజేయాలి. అలాగే, దరఖాస్తు, అవసరమైన ఆధారాలను సమర్పించాలి. ఆ తర్వాత ఇలా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఓటరు జాబితాను సవరిస్తారు. అక్టోబర్‌ 3న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement