గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని స్తంభాలగరువులోని వీహెచ్‌ఎల్ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అమీనుల్లా 50 ఏళ్లుగా వివిధ దేశాల నుంచి సేకరించిన తపాలా బిళ్లలు, పురాతన, ఆధునిక నాణేలు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీలను 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ప్రదర్శించారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మాజీ ఎమ్మెల్సీ కేఏస్ లక్ష్మణరావు, వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్ ఉడుముల లక్ష్మి ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచి పురాతన నాణేలు, కరెన్సీ, తపాలా బిళ్లల ప్రదర్శన సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. కార్యక్రమంలో కై లాష్‌నాఽథ్, షేక్ రబ్బానీ, చెంచురెడ్డి, శేషగిరిరావు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రదర్శన తిలకించారు.
చేబ్రోలు: దాడి దోపీడీ ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ పి.వీరనారాయణ అందించిన వివరాలు.. మండలం వడ్లమూడి, గురుపాలెం గ్రామానికి చెందిన అనుమల వంశీకృష్ణ, ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి స్థానిక మెయిన్ రోడ్డులోని వాటర్ సర్వీసింగ్ పాయింట్ వద్ద ఉండగా నిందితులు అతడిని అడ్డగించారు. వంశీకృష్ణపై దాడి చేసి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ రూ.22,300 నగదును దోచుకున్నారు. అనంతరం వంశీకృష్ణను శలపాడు రైల్వే గేటు వద్దకు తీసుకెళ్లి, అక్కడ మరో వ్యక్తి సాయంతో కత్తులు చూపించి, చంపేస్తామని రైలు కింద పడేసి చంపుతామని బెదింరించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తిని చూసి నిందితులు భయపడి, వంశీకృష్ణను వదిలేసి వెళ్లిపోయారు. ఈ కేసులో ప్రదాన నిందితులు నలుగురిలో గరువుపాలేనికి చెందిన తైదుల మనోజ్, ఉయ్యూరు శివకృష్ణ, సంగం జాగర్లమూడికి చెందిన చెరుకూరి జగదీష్, పసుపులేటి మోహన్‌లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు 17 సంవత్సరాల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.


