వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేత
నరసరావుపేట: భారతదేశం అభివృద్ధిలో దూసుకువెళుతోందని ఆ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. డిఫెన్స్ రంగంలో అనేక మిస్సైల్స్‌ను సొంతంగా ఏర్పాటు చేసుకుని, యుద్ధ రంగంలో ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఆర్థిక రంగం, స్పేస్ టెక్నాలజీలో ప్రత్యేకత చాటిందని తెలిపారు. ఇంకా అనేక రంగాల్లో ఎదగాల్సిన అవసరం ఉందని, ఇప్పటిలానే భవిష్యత్తులోనూ తమ పార్టీ దేశ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు.
వైఎస్ జగన్ పాలనలో పల్లెలకు మేలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యానికి ప్రతీక అన్నారు. వీటి ద్వారా 600 సేవలను గ్రామాలకు తీసుకెళ్లగలిగామని వెల్లడించారు. సుమారు పది వేల సచివాలయాలు, 8 వేల రైతు భరోసా కేంద్రాలు, 10 వేల విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 17 కొత్త మెడికల్ కళాశాలలు, 10 హార్బర్లు, నాలుగు పోర్టులు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. నాడు–నేడు కింద సుమారు 15 వేల పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించారని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా దీవెన, విద్యా వసతి, అమ్మఒడి వంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారన్నారు. రైతులకు ఆర్‌బీకేల ద్వారా రైతు పొలం దగ్గరికి విత్తనాలు, ఎరువులు అందించారని, రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.13 వేలు ఐదేళ్లపాటు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో రైతులకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఈ రాష్ట్రంలో అనేక గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దారని, 2029లో కచ్చితంగా మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా, సత్తెనపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, రొంపిచర్ల, నరసరావుపేట మండల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, ఇంటలెక్చువల్ ఫోరం, అంగన్‌వాడీ విభాగ రాష్ట్ర కార్యదర్శులు ఇయం. స్వామి, హెల్డా ఫ్లోరెన్స్, మాజీ ఎంపీపీ టి. మంగమ్మ, పలు విభాగాల నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, ఎన్‌కే ఆంజనేయులు, గంటెనపాటి గాబ్రియేలు, అన్నెంపున్నారెడ్డి, అన్నా చంద్రమోహన్, కొత్తూరి కిషోర్‌బాబు, దివ్వెల రామకృష్ణ, అచ్చి శివకోటి, నిడమానూరి సురేంద్రబాబు, మనీంద్రరెడ్డి, మూరే రవీంద్ర, మిట్టపల్లి చంద్రశేఖర్, మాట్ల లింగారెడ్డి, సయ్యద్ ఖాదర్‌బాషా, షేక్ రెహమాన్, కుక్కల పౌలయ్య, కూనిశెట్టి హనుమంతరావు, కారుమంచి మీరావలి, సుబ్రహ్మణ్యం నాయీ, షేక్ మస్తాన్ వలి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


