బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఓటరు హెల్ప్‌ డెస్క్‌లు | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ఓటరు హెల్ప్‌ డెస్క్‌లు

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగరంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లతోపాటు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఈ డెస్క్‌ల వద్ద ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలను నేరుగా స్వీకరించి, తదుపరి ప్రక్రియ కోసం సంబంధిత సూపర్‌వైజర్లకు అందజేస్తారని వివరించారు. నగర ప్రజలతోపాటు ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ కోరారు. తమ వార్డు కౌంటర్లను, బస్‌ స్టాండ్‌, రైల్వే స్టేషన్‌ హెల్ప్‌ డెస్క్‌లను సంప్రదించి సర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

దేచవరంలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

నకరికల్లు: మండలంలోని దేచవరం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు పరుచూరి గిరీష్‌ మణిపవన్‌ ఆధ్వర్యంలో హోమాలు జరిపించారు. 108 కలశాలతో విశేష అభిషేకాలు చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రికి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి కుటుంబ సమేతంగా వేడుకలలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు.

మునగోడులో కార్డన్‌ సెర్చ్‌

అమరావతి: మండల పరిధిలోని మునగోడు గ్రామంలో శుక్రవారం వేకువజామున పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు వంద మందికిపైగా పోలీసులు ఈ కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. రెండు ఎస్సీ కాలనీలతోపాటు గ్రామంలోని ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తనిఖీలలో 34 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్‌ చేసి అమరావతి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గంజాయి నిర్మూలన, హెల్మెట్‌ ధారణ, సైబర్‌ క్రైమ్‌ వంటి అంశాలపై పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీలలో సీఐ వై.అచ్చయ్య, ఎస్‌ఐలు జె.శ్రీనివాసరావు, కె.రాజశేఖర్‌లతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

రేపల్లె: నాణ్యమైన ఎరువులనే రైతులకు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అద్దేపల్లి లక్ష్మి అన్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో శుక్రవారం అధికారులతో కలసి ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఏపీఏఐఎంఎస్‌ 2.0 యాప్‌, ఐఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరుగుతున్న ఎరువుల విక్రయాలు, రైతుల వివరాల నమోదు విధానం, బయోమెట్రిక్‌, ఓటీపీ ఆధారంగా ఎరువుల పంపిణీ ప్రక్రియ తదితరాలను పరిశీలించారు. నాణ్యత లోపించిన ఎరువులు, పురుగు మందుల విక్రయిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో సహాయ వ్యవసాయ సంచాలకుడు వి.రమేష్‌ బాబు, మండల వ్యవసాయాధికారి ఎ.మహేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement