గుంటూరు మెడికల్ : పేద రోగులకు ఉపయోగపడేలా ప్రభుత్వ బడ్జెట్‌ను వినియోగించాల్సిన గుంటూరు జీజీహెచ్ అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తిపడి నిబంధనలు పక్కన పెట్టారు. వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువులను టెండర్ల ద్వారా కాకుండా కొటేషన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీల ప్రతినిధులకు తెలిసేలా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం వలన పోటీ పెరిగి వస్తువులు తక్కువ ధరకే వస్తాయి. కానీ సింగిల్ కొటేషన్ ద్వారా తమకు నచ్చిన కాంట్రాక్టర్ నుంచి కొనుగోలు చేసి సొంత లాభం చూసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాటాలు పంచుకుంటూ పేద రోగుల బడ్జెట్‌ను పంచేసుకుంటున్నారు.
ఏడాదికి రూ. 4 కోట్లకుపైగానే...
గుంటూరు జీజీహెచ్‌లో సర్జికల్ బడ్జెట్ వినియోగంలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రభుత్వం జీజీహెచ్‌కు ఏపీ ఎంఎస్ ఐడీసీ సంస్థ ద్వారా 80 శాతం సర్జికల్ వస్తువులు సరఫరా చేస్తుంది. సదరు సంస్థ ఏమైనా పంపిణీ చేయని పక్షంలోఆపరేషన్లకు వినియోగించే వైద్య పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం 20 శాతం బడ్జెట్‌ను జీజీహెచ్‌కు కేటాయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సుమారు రూ.కోటి చొప్పున ఏడాదికి నాలుగు కోట్లకుపైగా ప్రభుత్వం ఇస్తుంది. ఆస్పత్రి అధికారులు ఈ నిధులతో టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే ఎక్కువ మంది కాంట్రాక్టర్‌లు పాల్గొని తక్కువ మొత్తానికే సామగ్రి సరఫరా చేసే వీలుంటుంది. రెగ్యులర్‌గా వైద్య పరికరాలు కొనుగోలు చేస్తుండటం వలన కాంట్రాక్టర్లు కూడా సాధ్యమైనంత తక్కువ ధరకే సరఫరా చేస్తుంటారు. వచ్చే లాభాల్లో కొంత తగ్గించుకుని మరీ జీజీహెచ్‌లో టెండర్లు దక్కించుకుంటారు. ఇలాంటి కాంట్రాక్టర్‌లు తక్కువ కమీషన్లు ఇస్తున్నారని ఆస్పత్రి అధికారులు రూటు మార్చారు. కేవలం కొటేషన్లు... అది కూడా ఒకరు లేదా ఇద్దరు తెలిసిన కాంట్రాక్టర్లు, తమకు ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఇచ్చే వారికే సరఫరా బాధ్యత అప్పగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బడ్జెట్ చెల్లింపుల్లోనూ పక్షపాతమే.....
ఇటీవల ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ బడ్జెట్‌లను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు రూ.మూడు కోట్ల వరకు విడుదల కాగా... ఎక్కువ కమీషను ఇచ్చేవారికే బిల్లులు చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది కాంట్రాక్టర్‌లకే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే ఇతరులు టెండర్ల ద్వారా సరఫరా చేసే వాటిని నిలిపివేసే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించేలా, బిల్లులు చెల్లించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


