దాచేపల్లి : దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్‌లు) ఉండటంపై జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా శుక్రవారం ఆరా తీశారు. ఫారాలలోని వివరాలను టీడీపీ నాయకులు అప్‌లోడ్ చేస్తున్నట్లుగా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నాయకులు దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ జి. వెంకటేశ్వర్లును కలసి వినతిపత్రం అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆరా తీసి, విచారణ చేయాలని నగర పంచాయతీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నగర పంచాయతీ అధికారులు, సూపర్‌వైజర్లు బీఎల్‌ఓలతో మాట్లాడి ఎవరి వద్ద ఎన్ని ఫారాలు ఉన్నాయి.. ఎన్ని అప్‌లోడ్ చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ బీఎల్‌ఓ నుంచి ఫారాలు టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాయో తెలుసుకున్నారు. టీడీపీ నాయకులకు ఫారాలు ఇచ్చిన బీఎల్‌వోలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎవరిపైకి వచ్చి ఎంతమందిపై వేటు పడుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.


