నరసరావుపేట: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు నెలకు రూ.26 వేల కనీస వేతనంతోపాటు పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జై.కృష్ణకిరణ్ జిల్లాలో పర్యటిస్తూ ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదని అన్నారు. అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు ఎ.లక్ష్మీప్రసన్న, జిల్లా కార్యదర్శి శాంతమణి ఆధ్వర్యంలో వందల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పట్టణంలోని ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు తగిన వేతనాలు, భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి తదితరులు ప్రసగించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు డి.శివకుమారి, షేక్ సిలార్ మసూద్, హనుమంతరెడ్డి, పేరుబోయిన వెంకటేశ్వర్లు, జయలక్ష్మి, కవిత, శివపార్వతి, సావిత్రి, నిర్మల, సాయి, మాధవి పాల్గొన్నారు.


