నరసరావుపేట టౌన్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం న్యాయస్థాన భవనాల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, 13వ అదనపు జిల్లా సెషనన్స్ న్యాయాధికారి ఎస్.రమేష్ నేతృత్వంలో న్యాయాధికారులు మూడు బెంచ్ లుగా ఏర్పడి 2476 కేసులను పరిష్కరించారు. సివిల్, క్రిమినల్ కేసులతోపాటు ముందస్తు వ్యాజ్యాలు తదితర అన్ని రకాల వ్యాజ్యాలు కలిపి 2476 కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కారమైన కేసుల్లో కక్షిదారులకు రూ. 5,88,78,243 మేరకు లబ్ధి చేకూరింది. తొలుత న్యాయస్థాన ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయాధికారులు లోక్ అదాలత్ ప్రాధాన్యతను, విశిష్టతను, ఉపయోగాలను వివరించారు. న్యాయధికారులు కిరణ్ కుమార్, ఎ.సలోమి, న్యాయవాద సంఘ సభ్యులు, ప్యానల్ న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు పాల్గొన్నారు.
తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలోని శ్రీవారాహి దేవాలయంలో ఈనెల 15 నుంచి 24వ తేదీవరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, దీక్షాధారణ ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాల ఆహ్వానపత్రికను శనివారం స్థానిక మారీసుపేటలోని పోస్టల్ సహకార సొసైటీ భవనంలో శ్రీకాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ గౌరవ చైర్మన్ డీఎల్ కాంతారావు ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త, ‘పోస్ట్’ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు మాట్లాడుతూ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, హోమాలు, కుంకుమ పూజలు ఉంటాయని తెలిపారు. యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కల్యాణం శ్రీనివాసరావు, పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయవాదులుగా రాణించాలంటే భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం కీలకమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ చీమలపాటి రవి అన్నారు. శనివారం జేకేసీ కళాశాల రోడ్డులోని జాగర్లమూడి చంద్రమౌళి (జేసీ) న్యాయ కళాశాల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు న్యాయమూర్తులు న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల పాలకమండలి అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కార్యదర్శి కుప్పుస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణ ప్రసాద్, కోశాధికారి వెంకట కోటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాయపాటి కోటి సుధాకర్ (సుబ్బారావు) ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1,08,616 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ డీఈఓ కిశోర్‌కుమార్, అర్చకుడు రంగావఝుల శ్రీనివాసశాస్త్రి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


