తుమృకోట(రెంటచింతల): మండలంలోని తుమృకోట గ్రామంలో శుక్రవారం రాత్రి జన కెరటం ఎగసిపడింది. గ్రామంలో ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఇంద్రపల్లి ముత్యాలమ్మ జాతర మహోత్సవాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్..జేజే పీఆర్కే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ... నీరాజనం పలికారు. గ్రామ దేవతగా పూజలందుకుంటున్న ఇంద్రపల్లి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే పీఆర్కే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమృకోట గ్రామ ప్రజల ఇలవేల్పు అయిన ఇంద్రపల్లి ముత్యాలమ్మ తల్లి తుమృకోట గ్రామాన్ని, గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలని, రైతన్నల ఇంట పాడి పంటలు సమృద్ధిగా పండి సిరులు కురవాలని ఆక్షాంక్షించారు. గ్రామస్తులందరిపై గ్రామ దేవత శక్తిస్వరూపిని ఇంద్రపల్లి ముత్యాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు, మహిళలు, చిన్నలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ పీఆర్కేతో కరచాలనం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ తోరణాలతో అందంగా ముస్తాబు చేసి అలంకరించారు. ఆలయ చైర్మన్ పోట్ల వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.
ఇంద్రపల్లి ముత్యాలమ్మకు
పీఆర్కే ప్రత్యేక పూజలు


