రాజకీయ వేధింపులు ఆపాలి
డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన అక్రమ కేసులు వెనక్కి తీసుకోకపోతే సచివాలయం ముట్టడిస్తాం
ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై
నరసరావుపేట: ఐపీఎస్ అధికారి ముడావత్ సునీల్‌కుమార్ నాయక్‌పై రాజకీయ వేధింపులు ఆపాలని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్‌కు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సునీల్‌కుమార్‌ను రఘురామకృష్ణరాజు కేసులో రాజకీయ కుట్రతో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఒక గౌరవప్రదమైన ఐపీఎస్ అధికారిని ఫోన్ ద్వారా ఒత్తిడి చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ పేర్లు చెప్పాలని డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే నిందితుడిగా మారుస్తానని బెదిరించడం రాజకీయ బ్లాక్‌మెయిలింగ్ కాదా అని ప్రశ్నించారు. గిరిజన, దళిత అధికారులు ఉన్నత పదవుల్లో ఉండటం కొందరికి అసహనంగా మారిందన్నారు. ప్రత్యక్ష సంబంధంలేని కేసులో సునీల్ నాయక్ ఇరికించడం వెనుక ఉన్న అదృశ్య హస్తాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై గౌరవ రాష్ట్రపతి, జాతీయ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులు బనాయించడం ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. బుదలా బాబురావు కే.ప్రకాష్, ఇస్లావత్ హనుమంతునాయక్, కె.రవీంద్ర, వివిధ గిరిజన దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.


