అన్నదాతల్లో ‘గుర్తింపు’ ఆందోళన
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం భూములు ఉన్నవారు విధిగా నమోదు చేయించుకోవాలని ఆదేశం సర్వర్ వేధిస్తుండడంతో నిత్యం అవస్థలు పనులు లేక వలస బాటలో రైతులు కౌలు రైతుల గురించి ప్రస్తావించని సర్కార్ జిల్లాలో 2,42,982 మంది రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి
ఆందోళన అవసరం లేదు
సత్తెనపల్లి: అన్నదాతలను టీడీపీ ప్రభుత్వం టెన్షన్ పెడుతోంది. ప్రతి రైతు 11 అంకెల గుర్తింపు కార్డు తీసుకోవాలంటూ కొత్త మెలిక పెట్టింది. ఈ నెలాఖరులోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఒత్తిళ్లు ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
–● సర్వర్ పనిచేయక, రైతులు అందు బాటులో లేక, మృతులు, డోర్‌లాక్డ్‌తో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. సర్వర్ సమస్యతో పలు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
వలస బాటలో రైతులు...
ఈ ఏడాది ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంటలు వాతావరణం అనుకూలించక తెగుళ్లతో దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. పెట్టుబడులు చేతికి రాక, పండిన కాసింత పంట ధరల్లేక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. కుటుంబ పోషణ కోసం పిల్లాపాపలతో కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఇంకా నెల వరకు వచ్చే అవకాశం లేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు ఎక్కడ ముగుస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కార్డు లేకుంటే...
రైతు గుర్తింపు కార్డు ద్వారా పంట రుణాలు, సబ్సిడీలు, వడ్డీ రాయితీ, వ్యవసాయంత్ర పరికరాలు, పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ పథకం, వైపరీత్యాల సమయంలో అందే పరిహారం వంటివి అందనున్నాయి. కార్డు లేకుంటే ఇవన్నీ ఆగి పోతాయని ప్రభుత్వం పేర్కొంటోంది.
రైతు విశిష్ట గుర్తింపు కార్డు నమోదులో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పాం. పూర్తి వివరాలతో రైతులు గుర్తింపు కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రస్తుతం సొంత భూములు ఉన్న వారు తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులు ఆలస్యం చేయకుండా నమోదు చేయించుకునేందుకు ముందుకు రావాలి.
–ఎం. జగ్గారావు, జిల్లా వ్యవసాయ శాఖ
అధికారి, పల్నాడు


