ఇదేమిటి ‘సర్వే’శ్వరా?
సచివాలయ ఉద్యోగులపై సర్వేల భారం పుట్టుకొచ్చిన మరో కొత్త సర్వే నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలులోకి రాని యాప్‌తో మల్లగుల్లాలు
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పూటకో సర్వే పేరుతో ఇంటింటికీ తిప్పుతోంది. తాజాగా మరో కొత్త సర్వేకు శ్రీకారం చుట్టడంపై పలువురు ఉద్యోగులు పెదవిరుస్తున్నారు. దీనిని ఈనెల 18 నుంచి నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఇప్పటి వరకు యాప్ పూర్తిస్థాయిలో అమల్లోకి రాకపోవడంతో ఆందోళన పడుతున్నారు.
మూలిగే నక్కపై...
ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్‌ఓ విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే అంటూ చంద్రబాబు ప్రభుత్వం భారం మోపింది. ఇప్పుడు ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఇంటింటి నుంచి సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈ నెల 18న సర్వే ప్రారంభించి జనవరి 15కు పూర్తి చేయాలి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు ఒక రోజు శిక్షణ కూడా పూర్తి చేశారు. కానీ ఇంత వరకు సర్వేకు సంబంధించిన యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా అధికారులు సైతం తర్జనభర్జన పడుతున్నారు. చేసేదేమి లేక జిల్లా అధికారులు కూడా ఏ ఉద్యోగికి ఏ క్లస్టర్ కేటాయించాలనే దాని పై క్లస్టర్ల మ్యాపింగ్‌తోనే సరి పెడుతున్నారు.


