దాళ్వా సాగుపై స్పష్టత ఇవ్వని డీఆర్‌సీ
నరసరావుపేటరూరల్: దాళ్వా పంట సాగుపై తేల్చకుండానే సాగునీటి సలహా మండలి సమావేశం ముగించారు. కలెక్టరేట్‌లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నాగార్జున సాగర్‌లో నీటి లభ్యతపై చర్చించారు. సాగర్‌లో 26 టీఎంపీలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 10 టీఎంసీలు వేసవిలో తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. 16 టీఎంసీలు మాత్రమే సాగునీటి కోసం అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటికే దాళ్వా వరి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారని పలువురు డీసీలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రబీలో వరి సాగుపై స్పష్టత ఇవ్వాలని, నీటి సరఫరాపై స్పష్టత ఇవ్వకుంటే రైతులు నష్టపోతారని వివరించారు. మార్చి నెల వరకే నీటి విడుదల ఉంటుందని, సాగర్‌లో నీటి నిల్వలను పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు నీరు అందడం లేదని పలువురు డీసీలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి విడుదల తక్కువ ఉండటంతో చివరి భూములకు నీరు అందక మిరప, మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని డీసీ చైర్మన్ కుసుమ తెలిపారు. అలాగే అమరావతి డీసీ చైర్మన్, గుంటూరు బ్రాంచ్ కెనాల్ పరిధిలోని డీసీ చైర్మన్‌లు నీటి విడుదలలో లోపాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎన్‌ఎస్‌పి పరిధిలో చేపట్టిన మరమ్మతు పనులకు జీఎస్టీ ఎత్తివేయాలని వారు కోరారు.
కలెక్టరేట్‌లో సాగునీటి మండలి
సమావేశం
పాల్గొన్న ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,
ఎంపీ, ఎమ్మెల్యేలు
ఆయకట్టు చివరి భూములకు
నీరు అందడం లేదు
నీటి విడుదల పెంచాలని డిమాండ్


