104 ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
గాంధీపార్కు వద్ద ఉద్యోగుల ధర్నా
నరసరావుపేట: 104 వాహన ఉద్యోగులపై వేధింపులు ఆపి వారి డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 104 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీపార్కు వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ఆరోగ్య విభాగంలో తక్కువ వేతనాలతో విశేష సేవలు అందిస్తున్న 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి జీతానికి సంబంధించి పే స్లిప్ ఇవ్వాలన్నారు. జీతాలు పెంచకపోగా తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరైనా ఉద్యోగులు వారి సమస్యలపై ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.కోటిరెడ్డి మాట్లాడుతూ 104 ఉద్యోగులను వేధిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారంలోకి రాగానే 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, క్యాజువల్స్ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. జి.మల్లీశ్వరి, సిలార్ మసూద్, కామినేని రామారావు, మస్తాన్‌వలి తదితరులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచాల్సి ఉండగా కుదించి పనిభారం పెంచడం తగదన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


