మేలుకో వినియోగదారుడా!
ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
పార్కింగ్ ఫీజు..క్యారీ బ్యాగ్‌కు డబ్బు తీసుకోరాదు...
● ఏ వస్తువు కొన్నా బిల్లు
తప్పనిసరిగా తీసుకోవాలి
● వస్తు సేవల్లో లోపం ఉంటే
న్యాయం పొందేందుకు అవకాశం
● నేడు జాతీయ వినియోగదారుల
దినోత్సవం
సత్తెనపల్లి: సమాజంలో ఎక్కడ చూసినా మోసాలు, నాణ్యతలేని వస్తువుల విక్రయాలు అధికమయ్యా యి. వాటిని నమ్మి కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అలా నష్టపోకుండా వినియోగదారుల రక్షణ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం ఏ వస్తువును కొనుగోలు చేసినా దానికి సంబంధించిన బిల్లును తప్పనిసరిగా పొందాలి. బిల్లు ఆధారంగా జిల్లా లేదా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. డిసెంబర్ 24న ఏటా జాతీ య వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం.
కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం..
గుండు పిన్ను నుంచి గూగుల్ సేవల వరకు, పాల నుంచి ఫార్మా కంపెనీల కల్తీ వరకు, రియల్ ఎస్టేట్ మోసాల నుంచి కార్పొరేట్ ఈ–కామర్స్ సంస్థల దోపిడీ వరకు ఎక్కడైనా వస్తు సేవలో మోసం జరిగినా నాణ్యత లోపించినా వినియోగదారులు నేరుగా జిల్లా కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. రూ. 5లక్షల్లోపు మోసాలకు ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించకుండానే తగిన పరిహారం పొందవచ్చు. నేరుగా కమిషన్‌కు తెలుగులో ఫిర్యాదు రాసి ఇవ్వవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే పోరాటం చేయవచ్చు. రూ.5లక్షలు, ఆ పైన వివాదాలకు కోర్టు ఫీజులతో పాటు న్యాయవాదులను నియమించుకోవచ్చు. అంతేకాక ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనూ చేయవచ్చు.
ఫిర్యాదుల స్వీకరణ...
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించినా, నాసిరకం ఉత్పత్తులను అంటగట్టినా ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1967 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి ఫిర్యాదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు అవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఆ వివరాలు సంబంధిత జిల్లాలకు కమిషన్ పంపుతుంది. కేసు పరిష్కారం అయ్యేవరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఫిర్యాదులను పంపవచ్చు.
వినియోగదారులు మార్కెట్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకోకపోతే కచ్చితంగా మోసపోయినట్టే. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కోసం సదస్సులు నిర్వహిస్తున్నాం. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నరసరావుపేటలోని శంకరభారతీపురం పాఠశాలలో సదస్సు నిర్వహించనున్నాం.
–ఎంవీ.ప్రసాద్, డీఎస్‌ఓ పల్నాడు
షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి వీలులేదు. అలాగే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో క్యారీబ్యాగ్‌కు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయడానికి అధికారం లేదు. ఈ మేరకు రాష్ట్ర, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. జిల్లాలో కొన్ని మాల్స్, సూపర్ మార్కెట్లలో చట్ట విరుద్ధంగా వినియోగదారుల నుంచి పార్కింగ్, క్యారీ బ్యాగుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఎవరైనా తగిన ఆధారాలతో కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చెబుతోంది.
మేలుకో వినియోగదారుడా!


