క్రిస్మస్ సెలవులు కుదించడం తగదు
ఆర్జేడీకి ఫ్యాప్టో వినతి
గుంటూరు ఎడ్యుకేషన్: క్రిస్మస్‌కు ముందు, తరువాత రోజు పాఠశాల మొత్తానికి సెలవుగా పరిగణించుకుంటున్న విధానాన్ని మార్చివేసి, క్రిస్మస్ ఒక్కరోజునే ఉపాధ్యాయులకు సెలవులు ఇచ్చే పద్ధతి తీసుకురావడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ వై.శ్యాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డితో పాటు డీఈవో షేక్ సలీమ్‌బాషాను వారి కార్యాలయాల్లో కలిసిన ఫ్యాప్టో నాయకులు క్రిస్మస్ సెలవులను కుదించడం తగదని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ క్రిస్మస్ ముందు రోజు, తరువాతి రోజు పాఠశాలలు యథావిధిగా పని చేయాలని, పాఠశాలలో పని చేస్తున్న సగం మంది ఉపాధ్యాయులే ఆప్షనల్ హాలిడే ఉపయోగించుకుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లో క్రైస్తవ ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, అనేక మంది క్రైస్తవ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారందరు క్రిస్మస్‌కు ముందు రోజు, తరువాతి రోజు పాఠశాలకు హాజరు కాని నేపథ్యంలో పాఠశాల మొత్తానికి సెలవు పరిగణించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ఆర్జేడీని కలసిన వారిలో ఫ్యాప్టో జిల్లా నాయకులు షేక్ బాజీ, ఎం.కోటిరెడ్డి, బి.ప్రసాద్, జిలానీబాషా, పి.బాలాజీ, ఎస్‌కే రెహ్మాన్, వై.మనోజ్‌కుమార్ సయ్యద్ ఫర్హతుల్లా, జి.సుధాకర్, ఎండీ షుకూర్ ఉన్నారు.
గుంతకల్లు– మార్కాపురం ప్యాసింజర్ రైలు ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ మధ్య నూతన ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రారంభమైంది.దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు– మార్కాపూర్ రోడ్– గుంతకల్లు(నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపిందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్‌ఓ వినయ్ కాంత్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్ 57407/ 57408 గుంతకల్లు – మార్కాపూర్ రోడ్– గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ యొక్క ప్రతిపాదితన కేటాయించడం జరిగిందని తెలిపారు.
క్రిస్మస్ సెలవులు కుదించడం తగదు


