‘ఉపాధి’ చట్టం ఉసురు తీసిన కేంద్రం
సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ సీపీఎం, కాంగ్రెస్, దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
సత్తెనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 – 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అంచెలంచెలుగా నిర్వీర్యం చేస్తూ చివరకు పీక నులిమి వేసిందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. సత్తెనపల్లి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఎం, కాంగ్రెస్‌పార్టీ, ప్రజా సంఘాలు, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని సోమవారం జరిగిన నిరాహార దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. దీక్షకు సీపీఎం సత్తెనపల్లి మండల కార్యదర్శి పెండ్యాల మహేష్ అధ్యక్షత వహించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలకు, గ్రామీణ వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు, కుల మతాల కతీతంగా పనిచేయగలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ చట్టం 2005 ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉపాధి హామీ స్కీం 2025ను రద్దుచేసి కమ్యూనిస్టులు పోరాడి సాధించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
● నిరాహార దీక్షలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి జ్ఞానరాజ్ పాల్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు చిలకా చంద్రశేఖర్, చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు దుగ్గి అమూల్య, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు మల్లేశ్వరి, సీఐటీయు పట్టణ కన్వీనర్ జడ రాజ్ కుమార్‌లు మాట్లాడారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరాహార దీక్షలో సీపీఎం, కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


