కాకుమానులో గంజాయి స్వాధీనం
బాలుడి అరెస్టు వైజాగ్ నుంచి బాపట్లకు ఆటోలో తరలింపు మూడున్నర కేజీల గంజాయి స్వాధీనం
ప్రత్తిపాడు: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ జి. భానోదయ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం కాకుమాను ఎస్‌ఐ ఏక్‌నాథ్ స్థానిక అప్పాపురం రోడ్డు సమీపంలోని కరుణ రూరల్ గోడౌన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పెదనందిపాడు వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఆటోని నిలిపి తనిఖీ చేస్తుండగా, ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి దూకి పొలాల్లోకి పారిపోయాడు. దీంతో ఆటోలో ఉన్న బాపట్ల మండలం చెరువుజమ్ముల పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. ఈ మేరకు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి మూడున్నర కేజీల గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్‌ఐ. ఏక్‌నాథ్‌లు బాలుడిని అదుపులోకి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.


